తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. కానీ, తెలంగాణ బీజేపీలో కొందరు నేతలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ‘నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని..’ అంటున్నారు ‘గద్వాల’ జేజెమ్మ డీకే అరుణ. ‘నాకేం తక్కువ.?’ అంటున్నారు ఈటెల రాజేందర్. విజయశాంతి కావొచ్చు, ఇంకొకరు కావొచ్చు.. సీఎం అభ్యర్థులు ఎక్కువైపోతున్నారు తెలంగాణ బీజేపీలో.
ముఖ్యమంత్రి అవ్వాలనే లక్ష్యంతోనే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు బండి సంజయ్ విడతల వారీగా. మరోపక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలంగాణ సీఎం పీఠంపై కన్నేశారు. కానీ, బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నదానిపై క్లారిటీ లేదు.. ఇప్పట్లో రాదు కూడా.!
ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటి.? అక్కడ బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జనసేనను పూర్తిగా చంపేయడానికేనా.? అన్నట్టుంది బీజేపీ – జనసేన పొత్తు. బీజేపీ వల్ల జనసేనకు ఇసుమంతైనా లాభం లేదు. పైగా, బీజేపీ వల్ల జనసేనకు చాలా చాలా నష్టం జరుగుతోంది. ఈ విషయాన్ని జనసేన కూడా గుర్తించింది.
అయినాగానీ జనసేన – బీజేపీ మధ్య స్నేహం అలాగే కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి మాత్రం బీజేపీ – జనసేన కలిసి వుండే అవకాశం లేదు. ఎందుకంటే, బీజేపీలోని కొందరు నేతలే, జనసేన వైపుకు వెళ్ళిపోనున్నారు. గతంలో జనసేనకు చెందిన ఒకరిద్దరు నేతల్ని బీజేపీ లాగేసుకుంది. కానీ, బీజేపీ నుంచి జనసేనలోకి నేతలు వెళితే.. బీజేపీ ఆలోచన వేరేలా వుంటుంది.
కన్నా లక్ష్మినారాయణ రూపంలో బీజేపీకి పెద్ద షాక్ తగలబోతోంది రానున్న రోజుల్లో. ఆయన నేరుగా పవన్ కళ్యాణ్‌కి మద్దతిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కి అండగా వుండాలని అంటున్నారు కూడా. మాజీ కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్‌లోకి వెళ్ళారట. వైసీపీలో చాలామంది నేతల్ని కన్నా ‘దువ్వుతున్నారు’ అనే ప్రచారం జరుగుతోంది.
మొత్తంగా చూస్తే, ఏపీలో బీజేపీ ఖేల్ ఖతం అవడానికి ఎంతో దూరం లేదన్నమాట.