వెలువడిన ఫలితాల్లో బిజెపి, కాంగ్రెస్ ల విషయంలో సేమ్ టు సేమ్ విషయం ఒకటుంది. అదేమిటంటే రెండు పార్టీలకు కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. రెండు పార్టీలు కూడా మొత్తం 175 అసెంబ్లీలకు 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీ చేసాయి. అసలు అన్ని స్ధానాల్లో పోటీ చేసేంత సీన్ రెండు పార్టీలకు ఉందా అంటే లేదనే చెప్పాలి. కానీ అన్నీ స్ధానాలకు పోటీ చేయటమే విచిత్రంగా ఉంది.
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు తమను తాము ఎక్కువగా ఊహించుకున్నారు. అందుకనే ఎన్డీఏలో నుండి చంద్రబాబునాయుడు వెళ్ళిపోయే నాటికి రెండు పార్టీల మధ్య గొడవలు పెంచేసుకున్నారు. చంద్రబాబు బయటకు వెళ్ళిపోయిన దగ్గర నుండి టిడిపి పై బిజెపి నేతలు ఒంటి కాలిపై లేచిన విషయం అందరూ చూసిందే.
మొత్తం మీద బిజెపి నేతల వాదన ఎలాగుందంటే తమ ప్రమేయం లేకుండా ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు అన్నట్లుగా మాట్లాడారు. సరే ఏదెలాగున్నా ఇటు ఎంఎల్ఏ అటు ఎంపి సీట్లలో ఎక్కడా ఒక్కచోట కూడా గెలవలేదు. దాంతోనే బిజెపికున్న బలమేంటో అందరికీ అర్ధమైపోయింది.
అదే సమయంలో కాంగ్రెస్ కూడా అన్నీ నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఎక్కడా గెలవలేదు. మరి రెండు పార్టీలకు ఎన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు వచ్చింది తెలీదు. ప్రస్తుత పరిస్దితులను చూస్తే మరో రెండు సాధారణ ఎన్నికల్లో కూడా జనాలు ఓట్లేసేట్లు కనబడటం లేదు. అడ్డుగోలు రాష్ట్ర విభజన చేసినందు వల్లే కాంగ్రెస్ అంటే జనాల్లో ఇంకా మంట పోలేదు. సరే కారణాలేవైనా కానీండి రెండు పార్టీలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదన్నది వాస్తవం.