నేను తాగలేదు మొర్రో అన్నా వినే వారేరి

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రమాదాలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి నగర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి మందు తాగకున్నా  తాగినట్టు బ్రీత్ అనలైజర్ రీడింగ్ రావడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు ఏంటంటే…

ఉప్పల్ కు చెందిన నాగభూషణ్ రెడ్డి తాడ్ బండ్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి ఆయన పని ముగించుకొని ద్విచక్ర వాహనం పై ఇంటికి బయలు దేరాడు. తాడ్ బండ్ చౌరస్తాలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వర్తిస్తున్నారు. అతడి బండిని ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వర్తించారు. అతనిని పరీక్షించగా అతను మందు తాగినట్టుగా రీడింగ్ చూపించింది. దీంతో అతని వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. నాగభూషణ్ రెడ్డి మాత్రం తాను తాగలేదు మొర్రో అని మొత్తుకున్న పోలీసులు పట్టించుకోలేదు.

నాగభూషణ్ రెడ్డి స్వయంగా వెళ్లి అప్పటికప్పుడు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడి వైద్యులు అతను మద్యం తాగలేదని క్లీన్ చిట్ ఇస్తూ ఎమ్మెల్సీ నివేదికను ఇచ్చారు. మంగళవారం ఆ నివేదికతో వెళ్లినా పోలీసులు అతనికి వాహనం ఇవ్వలేదు. తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రవి  ఈ విషయమై స్పందించాడు. అతడు మద్యం తాగినట్టు నిరూపితమైందని అందుకే కేసు నమోదు చేశామన్నారు. డాక్టర్లే తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఈ సంఘటన చర్చనీయాంశమైంది.