టిడిపి ఎంపీ సీఎం రమేష్‌కు బిగ్ షాక్

టిడిపి ఎంపీ సీఎం రమేష్ ఇంటి పై ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కడప జిల్లా ఎర్రగుంట మండలం   పోట్ల దుర్తిలోని ఇంటి పై కూడా అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రమేష్ ఇంటి పై 10 మంది ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో 25 నుంచి 30 చోట్ల 100 మంది  ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీఎం రమేష్ ఢిల్లీలో ఉన్నారు.  ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.

ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో పోట్లదుర్తిలోని సీఎం రమేశ్‌ నివాసానికి 15 మంది ఐటీ అధికారులు చేరుకున్నారు. ఆ సమయంలో రమేశ్‌ సోదరుడు సీఎం సురేశ్‌ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అధికారులు ఆయన్ని బయటకు పంపించివేసి ఇంటి తలుపులు మూసివేశారు. ప్రస్తుతం ఐటీ అధికారులు అన్ని గదుల్లోనూ తనిఖీలు చేపడుతూ పలు దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్‌ నివాసంతో పాటు ఆయనకు చెందిన రుత్విక్‌ అనే సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 

తన ఆస్తులపై జరుగుతున్న దాడులపై సీఎం రమేష్ స్పందించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీపై నిలదీస్తున్నందుకే ఐటి దాడులు చేస్తున్నారని మండి పడ్డారు. ఏపీలో పెట్టుబడులు పెట్టకుండా చేయాలని కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. ఎన్నికల ముందు కేంద్రం భయానక వాతావరణం  తేవాలనుకుంటున్నా తమను ఏం చేయలేదన్నారు. కేంద్రానికి భయపడేది లేదన్నారు. తాము నిత్యం ట్యాక్స్ లు కడుతున్నామని రమేష్ తెలిపారు.

టిడిపి నేత బీద మస్తాన్ రావు ఇంటి పై దాడులు జరిగిన కొద్ది రోజులకే సీఎం రమేష్ ఇంటి పై దాడులు జరుగుతున్నాయి. దీని పట్ల టిడిపి కార్యకర్తలు మండి పడుతున్నారు. కేంద్రం నుంచి వైదొలిగాక టిడిపిని కేంద్రం టార్గెట్ చేస్తుందని నాయకులను, కార్యకర్తలను వేధించేందుకు అవకాశం ఉందని గతంలోనే చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐటి దాడులు కక్ష్య పూరితంగా జరుగుతున్నాయనేందుకు ఇదే నిదర్శనం అని పలువురు నేతలంటున్నారు.