త్వరలో టీడీపీకి భారీ షాక్ తగలనుందా? బలమైన నేత పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారా? అధిష్టానంపై అసంతృప్తితోనే ఆయన పార్టీ వీడనున్నారా? అంటే అవుననే అని టాక్ వినిపిస్తోంది ఆ నేత నియోజక వర్గంలో. ఆయన అధికార పార్టీ ఎంపీ. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన అప్పుడు కూడా 12 వ, 14 వ లోక్ సభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. 2014 లో టీడీపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే అంతటి సీనియర్ నేతకు టీడీపీలో అందుకు అసంతృప్తి నెలకొంది? ఆయన పార్టీని వీడాలని ఆలోచనకి ఎందుకు వచ్చారు? ఇంతకీ ఆ నేత ఎవరు? ఈ వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవాల్సిందే.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి…ఒంగోలు రాజకీయాల్లో ఈయనకు ప్రత్యేక స్థానం ఉంది. రెండు సార్లు కాంగ్రెస్ తరపున, ఒకసారి టీడీపీ తరపున ఎంపీగా గెలుపొందారు. నెగ్గాలి అంటే తానొక్కడికే కాదు ఆ నియోజకవర్గంలో పార్టీలో చిన్నస్థాయి నుండి పెద్ద స్థాయి లీడర్ల వరకు మంచి ఇమేజ్ ఉండాలి అని నమ్ముతారు. ఎంపీగా గెలవాలంటే ఆ పరిధిలో ఉన్న ప్రతి శాసన సభ్యుడు గెలవాలి అని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తారని సన్నిహితులు చెబుతారు. అప్పుడే తన గెలుపు సులభతరం అవుతుందని ఆయన నమ్మకం స్పష్టం అవుతుంది.
ఈ విషయంలోనే అధిష్టానానికి, ఆయనకీ విబేధాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులపై మాగుంట సర్వే చేయించినట్టు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా గెలుపు గుర్రాలు ఎవరో ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకి, స్థానిక టీడీపీ నేతలకు చెబుతున్నా… ఆయన మాట విన్పించుకోవట్లేదు అని టాక్. ఇదే విషయాన్నీ ఆయన సన్నిహితులతో చెప్పుకుని వాపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలకి ఆయన్ని దూరం పెడుతున్నారని ఒంగోలులో టాక్ నడుస్తోంది.
అభ్యర్థుల కేటాయింపులో ఆయన సూచనను పక్కన పెడుతున్న నేపథ్యంలో తన గెలుపుపై మాగుంట కలవర పడుతున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం తన మాటను పక్కన పెట్టడం, పార్టీ కార్యక్రమాల్లో ఆయన్ని ఇన్వాల్వ్ చేయకపోవడంతో మాగుంట తీవ్ర అసంతృప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడే ఆలోచనకు వచ్చినట్టు ఒంగోలులో చర్చలు నడుస్తున్నాయి.