ఎమ్మెల్యే బాలకృష్ణకు గట్టి షాక్ .. హిందూపూర్ లో వైసీపీ మద్దతు దారులు జయభేరి

balakrishna telugu rajyam

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరు , ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గం హిందూపురంలో ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో ఉన్న 38 సర్పంచ్‌ స్థానాలకు గానూ 30 స్థానాల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.

పెనుకొండ టిడిపి మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధికి కూడా షాక్‌ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో సర్పంచ్‌ అభ్యర్థి, మరువపల్లిలో వార్డు అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైసిపి మద్దతుదారులు గెలుపొందారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టిడిపి బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందాడు. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న సొంత పంచాయతీ మద్దనకుంటలోనూ టిడిపికి పరాభవం తప్పలేదు.

ఇదిలా ఉంటే, సీఎం వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో 100 శాతం పంచాయతీల్లో అధికార పార్టీ అభిమానులు విజయం సాధించగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుప్పం నియోజకవర్గంలో 93 పంచాయతీలు ఉండగా 89 పంచాయతీలకు మూడవ విడతలో ఎన్నికలు జరిగాయి. అందులో 75 పంచాయతీల్లో అధికార పార్టీ అభిమానులు విజయం సాధించగా, టీడీపీ మద్దతుదారులు కేవలం 14 పంచాయతీల్లో గెలిచారు.