హిందూపురం టాక్స్… బాలయ్యపై బీజేపీ బిగ్ స్కెచ్!!

ఈసారి ఏపీ రాజకీయాల్లో బీజేపీ తన మార్కు చూపించాలని భావిస్తుంది.. తన ఉనికి ప్రశ్నార్థకం కాకుండా కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. దీనికోసం కాపు ఓటు బ్యాంకు, హిందుత్వ అజెండాతో కొన్ని నియోజకవర్గాల్లో అయినా సత్తా చాటాలని కంకణం కట్టుకుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముద్రగడ పద్మనాభంతో టచ్ లోకి వెళ్లిందని.. చిరంజీవికి రాజ్యసభ ఇవ్వబోతుందని.. పవన్ తో తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తుందని అంటున్నారు.

ఈ సమయంలో కొన్ని కీలక నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని బీజేపీ భావిస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా తాజాగా టీడీపీ కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో అభ్యర్థిని ఫిక్స్ చేయబోతుందని తెలుస్తుంది. 2004, 2009, 2014, 2019లో వరుసగా హిందూపురంలో టీడీపీ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ కచుకోటలో బాలకృష్ణ రెండు సార్లు వరుసగా గెలిచారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని తపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో… బాలయ్య హ్యాట్రిక్ విజయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని వైసీపీ తీవ్ర కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే అధిక ప్రాధాన్యత అని చెబుతున్న వైసీపీ.. హిందూపురం అసెంబ్లీ నుంచి కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక, హిందూపురం పార్లమెంటు నుంచి బోయ – వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంతబరిలో ఉంటారని వెల్లడించింది.

ఫలితంగా… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లు తమకు దక్కుతాయని భావిస్తుంది. మరోపక్క జనసేనతో జతకట్టిన టీడీపీ… బలిజల ఓట్లు బలంగా తమకు పడతాయని భావిస్తుంది! ఈ సమయంలో బీజేపీ నుంచి కూడా అభ్యర్థి రెడీగా ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఒక స్వామీజీ పేరు తెరపైకి వచ్చింది! తాజాగా ఈ విషయాలపై నేరుగా ఆ స్వామీజీనే స్పందించారు. బీజేపీ ఓకే చెప్పడమే ఆలస్యం అని అంటున్నారు.

అవును… తనకు హిందూపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఉందని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని.. ఇందుకు వారు సుముఖత వ్యక్తం చేయవచ్చునని తాను భావిస్తున్నానని చెప్పారు. దేశంలో మరెక్కడా లేని విధంగా హిందూ అనే పదం హిందూపురానికి ఉందని.. ఇదే సమయంలో ఈ నియోజకవర్గ పరిధిలోనూ ఆలయాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని.. వాటి పరిరక్షణ కోసం తాను అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని స్వామి స్పష్టం చేశారు.

అయితే… ఎలాగూ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు కాబట్టి… ఆయనను హిందూపురం అసెంబ్లీకి పోటీచేయించే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉండోచ్చని అంటున్నారు పరిశీలకులు. హిందూపురం లోక్ సభ స్థానానికి ఇప్పటివరకూ బీజేపీ 2014, 2019ల్లో పోటీ చేసింది లేదు. ఈ సమయంలో… మారుతున్న సమీకరణల నేపథ్యంలో… హిందూపురం అసెంబ్లీకి పరిపూర్ణానంద స్వామిని పోటీ చేయిస్తే మేలు జరిగే అవకాశం ఉందని భావించే అవకాశం ఉందని చెబుతున్నారు.

దీంతో… అదే జరిగితే హిందూపురంలో స్వామి పోటీ వల్ల వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ నష్టం అనే చర్చ తెరపైకి వచ్చింది. టీడీపీ – జనసేన కూటమికి పడే ఓట్లలోనే చీలిక వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మరి ఇది ఏమేరకు కార్యరూపం దాల్చనుందనేది వేచి చూడాలి!