ఆంధ్రా కాంగ్రెస్ కు మరో షాక్: టీడీపీలోకి మాజీ మంత్రి

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల హడావిడి ఇప్పటి నుండే మొదలయ్యింది. రాజకీయ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష కార్యక్రమాలు మొదలుపెట్టాయి. రాజకీయ పార్టీల్లో స్థానికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థుల స్థానాల్లో పక్క పార్టీలో బలంగా ఉన్న అభ్యర్థులను చేర్చుకునే పనిలో పడ్డారు పార్టీ అధినాయకులు. నాయకులు కూడా పదవులు ఆశించి కండువాలు మార్చుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలయ్యింది. కాంగ్రెస్ పార్టీ నేతలకు గాలం వేస్తుంది అధికార పార్టీ. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నారు. ఇటు స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావుతోను టీడీపీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతోంది.

మరోవైపు మాజీ మంత్రి కొండ్రు మురళి, ఏపీ చీఫ్ కళా వెంకట్రావుతో భేటీ అయ్యారు. మురళి రాజాం టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. అయితే మురళి ఎంట్రీని వ్యతిరేకిస్తున్నారు ప్రతిభ భారతి.

మాజీ మంత్రి కొండ్రు మురళి, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి లు టిడిపిలోకి జంప్ చేస్తారని చాలా రోజులు నుండి వార్తలొస్తున్నాయి. అయితే, అవి తప్పన్నట్లు మురళీ ప్రవరిస్తూ వచ్చారు. ఎందుకంటే, మొన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజయవాడ వచ్చినపుడు జరిగిన కాంగ్రెస్ సమావేశానికి కూడా మురళీ వచ్చారు. దీంతో ఇక ఆయన కాంగ్రెస్ లోనే ఉంటారనుకున్నారు. అయితే, ఇపుడే ఈ అంచనా తారుమారయింది.

కొండ్రుమురళి చిన్న వయసులోనే రాజకీయాల్లో పైకొచ్చి ఇపుడు నిరుద్యోగి అయిపోయారు. ఆయన్నెవరూ పట్టించుకోవడం లేదు. దానికితోడు కాంగ్రెస్ మళ్లీ బతికి బుసగొడుతుందనే నమ్మకం లేదు. అందువల్ల మురళీ, కిళ్లీ తమ దారి చూసుకోవడం మొదలుపెట్టారు.

కొండ్రు ముర‌ళి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగాడు. యువ‌కుడు, ద‌ళితుడు కావ‌డంతో పాటు ఆరోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనని పైకి తీసుకొచ్చారు. రెండోసారి గెలిచాక మంత్రిని కూడా చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం, ఎచ్చెర్ల నియోజ‌క‌వ‌ర్గాల నుంచి రెండుసార్లు పోటీ చేసి టీడీపీలో కాక‌లు తీరిన ప్ర‌తిభాభార‌తిని ఓడించడంతో ఆయన జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు.

అలాంటి కొండ్రు మురళి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తో పాటే అడ్రసులేకుండా పోయారు. 2014 గ‌త ఎన్నిక‌ల‌నుంచి ఇప్పటివ‌ర‌కూ ఏ పార్టీలోనూ చేర‌లేదు. వైఎస్ ఆదరించారు కాబట్టి, తమ పార్టీలో చేరతాడని వైసిపి నేతలు భావించారు. అయితే, ఉత్తరాంధ్రలో బలమయిన బొత్స ఉన్నపుడు మురళీ వైసిపిలో చేరకపోవచ్చని కూడా కొందరు భావించారు. అందువల్ల మిగిలింది టిడిపియే. టిడిపి రాజాం టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతోనే ఆయన టిడిపిలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక కిల్లి కృపారాణి భవితవ్యం తేలాల్సి ఉంది.