అవినాశ్ రెడ్డికి ఎదురు దెబ్బ అట.! కామెడీ కాకపోతే.!

కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సర్వోన్నత న్యాయ స్థానంలో ఎదురు దెబ్బ తగిలిందట.! ఔనా.? అదెలా.? అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయాలన్న ఆలోచనతో సీబీఐ వున్నట్టు లేదు. అలాంటప్పుడు, సర్వోన్నత న్యాయస్థానం అవినాశ్ రెడ్డికి మద్యంతర బెయిల్ విషయంలో షాక్ ఇచ్చినా, అది ఆయనకు ఎదురు దెబ్బ కానే కాదు.

ప్రస్తుతం కర్నూలులోని ఓ ఆసుపత్రిలో వున్నారు అవినాశ్ రెడ్డి. అదే ఆసుపత్రిలో అవినాశ్ రెడ్డి తల్లి తీవ్ర అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతున్నారు. అవినాశ్ రెడ్డి, సీబీఐ విచారణకు హాజరు కావాల్సి వుండగా, తల్లి అనారోగ్యం పేరు చెప్పి.. ఆయన విచారణకు డుమ్మా కొడుతున్నారు.

అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందన్నది ఓ ప్రచారం. ఈ విషయమై సీబీఐ ఎలాంటి అధికారిక ప్రకటనా జారీ చేయడంలేదు. అదే ఆశ్చర్యకరం. కర్నూలుకి వెళ్ళింది సీబీఐ బృందం, అదీ హైద్రాబాద్ నుంచి. కానీ, కర్నూలులో వైసీపీ శ్రేణులు, సీబీఐకి అడ్డం పడుతున్నాయి.

నడుస్తున్న వ్యవహారమిది.! ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో అవినాశ్ రెడ్డి, ముందస్తు బెయిల్ పిటిషన్ మూవ్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈలోగా సీబీఐ అరెస్టు చేయాలనుకుంటే, చేసుకోవచ్చనీ సుప్రీంకోర్టు పేర్కొంది.

కానీ, సీబీఐ అసలు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయాలని అనుకోవాలి కదా.? అనుకుంటే, అరెస్టు చేయడం పెద్ద కష్టమా.?