బోట్లు తగలబడ్డాయ్.! వైసీపీ ఇమేజ్ కూడా తగలబడిపోయింది.!

అసలు ఆ బోట్లను ఎవరు తగలబెట్టారు.? ఎందుకు తగలబెట్టారు.? అనుకోకుండా జరిగిన ప్రమాదమా.? కుట్రపూరితంగా జరిగిన వ్యవహారమా.? తేల్చాల్సింది పోలీసులే.! ముందైతే, జనసేన మద్దతుదారుడు లోకల్ బాయ్ నాని ఈ ఘటనకు కారకుడిగా తీర్పునిచ్చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

యూ ట్యూబర్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను చావగొట్టారంటూ పోలీసులపై లోకల్ బాయ్ నాని ఆ తర్వాత ఆరోపణలు చేశాడు. మరోపక్క, ఈ కేసుతో లోకల్ బాయ్ నానికి సంబంధం లేదని తేలినట్లు పోలీసులు ప్రకటించారు. లోకల్ బాయ్ నానిని విడుదల చేసేశామనీ అన్నారు.

తనకు అసలు జనసేన పార్టీతో సంబంధం లేదనీ, యూ ట్యూబర్‌ని గనుక, పలువురు హీరోలను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేస్తుంటానని చెప్పాడు. అబ్బే, లోకల్ బాయ్ నాని కాదు, వాసుపల్లి నాని.. అంటూ కొత్త పల్లవి అందుకున్నారు పోలీసులు. వైసీపీ మాత్రం ‘నాని’ అనే పేరునే ప్రస్తావిస్తోంది.

మద్యం మత్తులో సిగరెట్టో.. బీడీనో విసిరేస్తే, ప్రమాదవశాత్తూ బోట్లు కాలిపోయాయని కాకమ్మ కథలు తెరపైకొచ్చాయి. అవి బోట్లు.. అంత తేలిగ్గా కాలిపోతాయా.? ఛాన్సే లేదు.! సముద్రంలో చేపల వేటకు వెళ్ళినప్పుడు, అక్కడే వంట చేసుకోవాల్సి వుంటుంది. సో, కేవలం నిప్పుతో బోట్లు కాలిపోయాయనడం అంత సమంజసంగా అనిపించడంలేదు.

ఎక్కడో తేడా జరిగింది.! ఆ తేడా ఏంటన్నది తేలాల్సి వుంది. అంతర్వేది రథం తగలబడితే, తేనె తుట్టె వల్ల.. అంటూ పనికిమాలిన లాజిక్కుని అప్పట్లో తెరపైకి తెచ్చారు. ఇప్పుడీ బోట్లు కాలిపోవడానికి సంబంధించిన కారణాలూ అలాగే తగలడ్డాయ్.

నిజా నిజాలు బయటకు వస్తాయా.? వస్తాయో రావోగానీ, ఈ తరహా ఘటనల్లో వైసీపీ తొందరపాటు, ఆ పార్టీ కొంప ముంచేస్తున్నమాట వాస్తవం. సలహాదారులు సరిగ్గా వ్యవహరించకపోతే, పార్టీ సీనియర్లు బాధ్యతాయుతంగా పార్టీని డ్రైవ్ చేయకపోతే.. ఇదిగో ఇలాగే, పార్టీ పరువు బజార్న పడుతుంది.!