వైసీపీలో జరుగుతున్న వర్గపోరులో గన్నవరం, చీరాల విబేధాలు ప్రథమ స్థానంలో ఉన్నాయి. గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి ఎంటరవడంతో దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు ఎదురుతిరిగారు. ప్రస్తుతం ఈ మూడు వర్గాల నడుమ వైసీపీ కేడర్ నలిగిపోతోంది. ఇక చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గాల నడుమ పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది. ఇద్దరూ పెద్ద లీడర్లే కావడంతో ఎవరివైపు పనిచేయాలో తెలియక వైసీపీ శ్రేణులు తికమకపడుతున్నాయి. ఒకరికి సపోర్ట్ చేస్తే ఇంకొకరు ఎక్కడ కన్నెర్రజేస్తారోనని బెదిరిపోతున్నారు. ఇలాంటి సీన్లే దర్శి నియోజకవర్గం వైసీపీలో కూడ రిపీట్ అవుతున్నాయి. ఏకంగా ఇక్కడ రెండు సామాజికవర్గాల నడుమ యుద్ధం జరుగుతోంది.
దర్శిలో వైసీపీ తరపున కాపు సామాజికవర్గానికి చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదట టికెట్ రెడ్డి వర్గానికి చెందిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికే ఇవ్వాలని జగన్ అనుకున్నారు. ఆ మేరకు ఆఫర్ కూడ ఇచ్చారు. కానీ శివప్రసాద్ మాత్రం ఎన్నికలను నడిపించే ఆర్ధిక బలం తనకు లేదని అంటూ పక్కకు తప్పుకున్నారు. దీంతో జగన్ ఆర్థికంగా మంచి బలమున్న మద్దిశెట్టి వేణుగోపాల్ కు అవకాశం ఇచ్చారు. వేణుగోపాల్ శక్తిమేర ధారబోశారు. దానికితోడు జగన్ హవా పనిచేయడంతో వేణుగోపాల్ గెలుపొందారు. అయితే ఏడాది తిరగకుండానే ఆ గెలుపు చేదు అనుభవాన్ని ఇస్తోంది మద్దిశెట్టికి.
ఎన్నికల సమయంలో చేతులెత్తేసి పక్కకు తప్పుకున్న బూచేపల్లి ఇప్పుడు పార్టీలో అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఎమ్మెల్యేను సైతం లెక్కచేయడంలేదట. అదేమంటే ఎమ్మెల్యే కాపు వర్గమని. తాము రెడ్డి వర్గమని అంటున్నారట. వైసీపీలో విపరీతంగా ఉన్న రెడ్డి వర్గం డామినేషన్ కూడ బూచేపల్లికి బాగా కలిసొస్తోందట. జిల్లా స్థాయి నేతలు చెప్పినా ఆయన తగ్గట్లేదట. దీంతో మద్దిశెట్టి తీవ్ర సంతృప్తితో ఉన్నారట. ఎన్నికలప్పుడు చేతులెత్తేస్తే అన్నీ తానై శక్తికి మించి ఖర్చు చేశానని ఇప్పుడొచ్చి రెడ్డి వర్గమనే పేరుతో పెత్తనం చేస్తున్నారని వాపోతున్నారట ఆయన. అధికారాల బదిలీ నుండి పదవుల కేటాయింపుల వరకు అన్నింట్లోనూ వేలుపెడుతున్నారని, ఎమ్మెల్యే అనే కనీస విలువ కూడ ఇవ్వట్లేదని అసంతృప్తితో ఉన్నారట. ఫలితంగా పాలన కుంటుబండిందని, అభివృద్ధి అటకెక్కిందని, అన్ని చోట్ల వ్యక్తులు కొట్టుకుంటుంటే ఇక్కడ మాత్రం రెండు సామాజికవర్గాలు కొట్టుకుంటున్నాయని విసుక్కుంటున్నారట జనం.