దసరా బరిలో సరైన ‘బొమ్మ’ పడి వుంటేనా.?

విజయదశమి…(దసరా) తెలుగు సినిమాకి సంక్రాంతి తర్వాత పెద్ద సీజన్ అనే చెప్పుకోవాలి. ఈ విజయదశమికి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఒకటి ‘మహాసముద్రం’, ఇంకోటి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, మరొకటి ‘పెళ్ళి సందడి’.

పండగ సీజన్ కదా.. మూడు సినిమాలూ తొలి రోజు వసూళ్ళను బాగానే రాబట్టాయి. రెండో రోజు కూడా ఓకే. మూడో రోజు కూడా ఇబ్బంది వుండకపోవచ్చు. కానీ, ఇది అసలు సిసలు పండగ కాదు సినిమాకి. ఎందుకంటే, రావాల్సిన పెద్ద సినిమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్యుపెన్సీ సమస్య కారణంగా వెనక్కి వెళ్ళాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి నిమిషంలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిచ్చిన విషయం విదితమే. లేదంటే, పెద్ద సినిమాలే విజయదశమి బరిలోకి దిగి వుండేవి. సెలవుల సీజన్ ముగిసిపోతుండడంతో ఇప్పుడు విడుదలైన సినిమాలు కూడా గట్టిగా క్యాష్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది.

ఏదిఏమైనా, థియేటర్లలో జనం కళకళ్ళాడటంతో, బక్సాఫీస్ కళకళలు చూసి తెలుగు సినిమా మురిసిపోతోంది. పెద్ద సినిమాలు ముందు ముందు క్యూ కట్టేస్తే.. ఈ జాతర ఇలాగే.. ఇంకాస్త అందంగా వుంటుందన్నది నిర్వివాదాంశం. మరి, పెద్ద హీరోలు రిస్క్ చేస్తారంటారా.?