అరెస్టులతో వైసీపీకి బీభత్సమైన డ్యామేజ్.! కానీ, ఎందుకిలా.?

రాజకీయాలన్నాక విమర్శలు, ఆరోపణలు సహజాతి సహజం. ఆందోళనలు, ధర్నాలు ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరిగేవే. వాటితోపాటే అరెస్టులు కూడా సర్వసాధారణం. టీడీపీ హయాంలో పెట్టిన కేసుల్ని చాలావరకు వైసీపీ హయాంలో ఎత్తేశారు. రేప్పొద్దున్న మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పెట్టబడిన కేసులన్నటినీ ఎత్తేయడం జరుగుతుంది.

ఈమాత్రందానికి పోలీసులు ఎందుకు ఎవర్నయినా అరెస్టు చేయాలి.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడి విషయంలో నానా యాగీ జరుగుతోంది. ఏపీ సీఐడీ, అయ్యన్నపాత్రుడి తనయుడి ఇంటికి వెళ్ళారట.. నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారట. అక్కడి నుంచి అప్పటికే ఆయన ఉడాయించాడట. ఇదీ జరిగిన కథ.

అరెస్టు చేయడానికి పోలీసులు వస్తే, దాన్నుంచి తప్పించుకునేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నించడం కొత్తేమీ కాదు. బెయిల్ కోసం తెరవెనుకాల ప్రయత్నిస్తారు.. ఈలోగా కొన్ని రోజులు అజ్ఞాతంలో వుంటారు కూడా. రాజకీయ నాయకులందరికీ తెలిసిన విషయమే ఇది. పార్టీలకతీతంగా రాజకీయ నాయకులంతా ఫాలో అయ్యే వ్యవహారమే.

కాకపోతే, వైసీపీ హయాంలో ప్రతి అరెస్టూ వివాదాస్పదమవుతోంది. పోలీసులు నానా తంటాలూ పడి అరెస్టు చేయడం, ఆ తర్వాత న్యాయస్థానాలో తిరిగి పోలీసులకే మొట్టికాయలు పడటం. ఇదొక ప్రసహనంగా మారిపోయింది. అయినా, పోలీసుల పద్ధతీ మారడంలేదు.. రాజకీయ నాయకుల పద్ధతీ మారడంలేదు.

అయ్యన్నపాత్రుడి తనయుడి వ్యవహారం ముందు ముందు ఏమవుతుంది.. అంటే, అదేమీ మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు. ముందస్తు బెయిల్ తెచ్చుకుంటాడాయన.. ఒకవేళ పోలీసులు అతన్ని పట్టుకుని, ఈ కేసులో ఆయనకేమీ ఉరిశిక్ష పడిపోదు.
కానీ, ఈ మొత్తం ప్రసహనం వైసీపీకి రాజకీయంగా చాలా డ్యామేజ్ చేస్తుంది. ‘చేతకాని పాలన’ అనే ముద్ర వైసీపీ మీద పడేలా చేస్తున్నాయి ఈ అరెస్టులు.