బిగ్ బ్రేకింగ్: ఇరిగెల రాజీనామా..టిడిపికి భారీ షాక్..ఏ పార్టీలో చేరుతారో ?

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో టిడిపికి భారీ  షాక్ తగిలింది. ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ వైఖరి నచ్చక జిల్లాలో సీనియర్ నేత ఇరిగెల రామ్ పుల్లారెడ్డి ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పుల్లారెడ్డి రాజీనామా ప్రకటనతో టిడిపి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంత్రి అఖిల భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందని ఇరిగెల ఆరోపించారు. కార్యకర్తలు, తన మద్దతుదారులతో సమావేశం జరిగిన ఇరిగెల తన రాజీనామాను ప్రకటించటం గమనార్హం. మంత్ర అవినీతి వ్యవహరాలతో పాటు ఒంటెత్తు పోకడలను చంద్రబాబునాయుడుకు చెప్పినా పట్టించుకోలేదన్నారు.

 

భూమా అఖిలప్రియ అవినీతికి పాల్పడటమే కాకుండా పార్టీ నేతలను ఏమాత్రం లెక్క చేయటం లేదన్నారు. దాంతో నేతలందరూ మనస్తాపానికి గురవుతున్నట్లు ఇరిగెల మండిపడ్డారు. ఇరిగెల చాలా కాలంగా ఫిరాయింపు మంత్రితో పాటు పార్టీ నాయకత్వంపై బాగా అసంతృప్తిగా ఉన్నారు. తనను నాయకత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదని తనకు సంబంధించిన పనులను ఏమాత్రం ముందుకు సాగకుండా ఫిరాయింపు మంత్రి అడ్డుపడుతున్నట్లు రాం పుల్లారెడ్డికి మంటగా ఉంది. అదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి చెప్పి సర్దుబాటు చేయమని అడిగినా పట్టించుకోలేదట. దాంతో ఈరోజు రాం పుల్లారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

 

రామ్ పుల్లారెడ్డి పార్టీలో గట్టి నేతగానే చెప్పుకోవాలి. వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నుండి కానీ లేకపోతే ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, భూమా అఖిలప్రియ కూడా ఆళ్ళగడ్డ నుండే ఎన్నికవ్వటంతో టిక్కెట్టు అవకాశం లేదు. అందుకనే నంద్యాలలో కానీ మరేదైనా నియోజకవర్గంలో కానీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే, పార్టీ నాయకత్వం నుండి సానుకూల స్పందన కనిపించలేదు.

 

పోటీ చేసే అవకాశం లేనపుడు కనీసం ఆర్దికంగా బలోపేతమయ్యేందుకైనా సాయం చేయాలని రాం పుల్లారెడ్డి కోరుతున్న పార్టీ పట్టించుకోవటం లేదు. దాంతో టిడిపిలో ఉండి లాభం లేదని గ్రహించిన ఇరిగెల చివరకు టిడిపికి రాజీనామా చేసేశారు. సరే చివరకు ఇరిగెల ఏ పార్టీలో చేరుతారన్న విషయంలో స్పష్టత లేదు. వైసిపిలో కూడా పోటీకి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మిగిలింది జనసేన మాత్రమే. మరి రాం పుల్లారెడ్డి ఏం చేస్తారో చూడాలి.