భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల రాజకీయం వేరు. వాళ్ళకంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో మంచి గుర్తింపు, పట్టు, గౌరవం.. అన్నీ వుండేవి. కాలక్రమంలో ‘భూమా’ కుటుంబమంటేనే స్థానికంగా అసహనం పెరిగిపోయే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి.
మరీ ముఖ్యంగా భూమా నాగిరెడ్డి మరణం తర్వాత, జిల్లాలో.. ఆళ్ళగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో ‘భూమా’ పేరు చెబితేనే జనం చిరాకు పడే పరిస్థితి వచ్చేసింది. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకోవడం తప్ప, భూమా వారసులు.. జనానికి చేసిన మంచి ఏమీ లేదు. ఇంకోపక్క, శిల్పా కుటుంబానిదీ అదే పరిస్థితి. ప్రస్తుతం శిల్పా కుటుంబం వైసీపీలో వుంది. ఆ శిల్పా కుటుంబాన్ని భూమా కుటుంబం సవాల్ చేస్తోంది. శిల్పా కుటుంబం టీడీపీలోకి దూకేస్తోందన్నది భూమా అఖిల ప్రియ చేస్తోన్న ఆరోపణల సారాంశం.
ఏమో, శిల్పా కుటుంబం వైసీపీకి హ్యాండిచ్చినా ఇచ్చేయొచ్చు.. ఆ కుటుంబం చేసే రాజకీయం అలాగే వుంటుంది. ఏ పార్టీలోనూ స్థిరంగా వుండదు ఆ కుటుంబం. కాకపోతే, భూమా అఖిల ప్రియ.. టీడీపీలోనే కొనసాగుతారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది. భూమా అటు.. శిల్పా ఇటు.. ఎప్పుడూ ఇదే తంతు జరుగుతుంటుంది. శిల్పా కుటుంబం గనుక టీడీపీలోకి వస్తే, భూమా కుటుంబం అటువైపు జంప్ చేసే అవకాశాల్లేకపోలేదు. వైసీపీ ఈ పరిణామాల్ని లోతుగా పరిశీలిస్తోంది.. శిల్పా కుటుంబంపై ఓ కన్నేసిందని తెలుస్తోంది.