భీమవరం, గాజువాక.! జనసేనాని పవన్ కళ్యాణ్ డైలమా.!

గాజువాక నియోజకవర్గాన్ని ఎంచుకోవడమంటే ఇంకోసారి తప్పిదం చేసినట్లవుతుందా.? భీమవరంలో ఓసారి ఓటమి చవిచూశాక, ఇంకోసారి అదే నియోజకవర్గం ఎంచుకోవడం ఎంతవరకు సబబు.? ఇలా టోటల్ కన్‌ఫ్యూజన్‌లో వున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

పొత్తుల చర్చలు షురూ అవుతున్నాయ్ గనుక, పోటీ చేసే నియోజకవర్గంపై జనసేనాని స్పష్టత ఇవ్వాలన్నది తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ. ఆ రెండిటినీ జనసేనకే వదిలేసి.. మిగతా వ్యవహారాలు చూసుకోవాలనే గుసగుసలూ వినిపిస్తున్నాయి టీడీపీలో.

ఇదిలా వుంటే, అటు భీమవరంలో ఇప్పటికే జనసేన పార్టీ అంతర్గత సర్వే జరిగింది. గాజువాకలో మాత్రం ఇప్పట్లో సరైన సర్వే జనసేన నిర్వహించే అవకాశం లేదు. వారాహి విజయ యాత్ర, విశాఖలో చేశాకనే.. అక్కడా సర్వే జరుగుతుంది.

అయితే, స్థానికంగా జనసైనికులు చేయిస్తున్న సర్వేల్లో, జనసేన పార్టీకి ఎడ్జ్ బాగా కనిపిస్తోందట. ‘గతంలోనే జనసేనాని గెలవాల్సి వుంది. కానీ, ఎలా ఆయన ఓడిపోయారో మాకు అర్థం కావడంలేదు’ అంటున్నారు జనసైనికులు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకూ తావివ్వబోమనీ, బంపర్ మెజార్టీతో పవన్ కళ్యాణ్‌ని గెలిపిస్తామనీ జనసైనికులు అంటున్నారు.

వాస్తవానికి, వైసీపీ సంగతెలా వున్నా.. తెలుగుదేశం పార్టీతోనే జనసేనకు పెద్ద ముప్పు పొంచి వుంది. టీడీపీతో జనసేన కలవడాన్ని ఇష్టపడని జనసైనికులూ వున్నారు మరి.! మరోపక్క, జనసేనకు సహకరించకూడదనుకునే తెలుగు తమ్ముళ్ళూ లేకపోలేదు. ఈ విషయమై జనసేనాని కూడా ఒకింత డైలమాలో వుండడంలో వింతేముంది.?