ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు పొత్తుల కోసం తెగ ప్రాకులాడుతున్నారు. ఒకపక్క జనసేన అధినేతేమో… బాబుతో పొత్తుకోసం ఉత్సాహం చూపిస్తుంటే… బాబు మనసుమాత్రం బీజేపీపై ఉంది. పవన్ ఎలాగూ ఉన్నరనే నమ్మకమో.. లేక, తనను కాదని పవన్ సొంత నిర్ణయాలేమీ తీసుకోరన్న ధైర్యమో కానీ… పవన్ విషయంలో ప్రశాంతంగా ఉన్న బాబు… బీజేపీ విషయంలో తెగ టెన్షన్ పడుతున్నారు.
ఏపీ బీజేపీకి అంత సీనుందా:
ఏపీలో బీజేపీకి ఉన్న ఓట్ల శాతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. గడిచిన సార్వత్రిక ఎన్నికల దగ్గరనుంచి చూసుకుంటే.. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మధ్యలో జరిగిన ఉప ఎన్నికలు, తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు… ఏ ఎన్నికల్లో చూసినా ఏమున్నది గర్వకారణం… నోటాను దాటేందుకే నిత్య పోరాటం అనేపరిస్థితి. అయినా కూడా చంద్రబాబు మాత్రం బీజేపీకోసం ప్రాకులాడుతుంటారు.
బీజేపీ పెద్దల టెక్కు:
ఏపీలో బీజేపీకి ఉన్న ఓటుబ్యాంక్ అతిస్వలం అని ఇప్పటివరకూ జరిగిన అన్ని ఎన్నికలూ పోటీపడి మరీ నిరూపించాయి. దీంతో.. ఈ సమయంలో కూడా చంద్రబాబుతో కలవడానికి హస్తినలోని బీజేపీ నేతలకు ఎందుకు అంత టెక్కు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సోము వీర్రాజు సైతం చంద్రబాబు పేరెత్తితే అంతెత్తున లేస్తున్న పరిస్థితి.
బీజేపీలో టీడీపీ సీనియర్లు:
గతంలో ఈడీ కేసుల వల్లో.. లేక, మరో కారణంతోనో కానీ… బీజేపీలో చేరిన టీడీపీ సీనియర్లు సైతం త్వరలో పాతగూటికి చేరిపోతున్నారని తెలుస్తుంది. దీంతో… ఏపీలో బీజేపీకి ఉన్న ఆ ఒక్కశాతానికి కూడా కన్నం పడే పరిస్థితి. అలా అని ఇంతకాలం బీజేపీలో ఉన్న ఆ టీడీపీ సీనియర్లు… ఏపీలో కమళం అభివృద్ధికి చేసిన పనులు శూన్యం అనుకోండి… అది వేరే విషయం. వీరు కూడా టీడీపీతో బీజేపీని కలపడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయినా కూడా బీజేపీ పెద్దలు కరగడం లేదు.
కర్ణాటక ఫలితాలపై బాబు ఫోకస్:
తాను పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ… ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో ఫుల్ బిజీగా ఉంది. అక్కడ గెలవడం బీజేపీకి చాలా అవసరం. దక్షిణాదిలో కాషాయ జెండా పాతాలనే హోప్స్ సజీవంగా ఉండాలంటే కర్ణాటక ఫలితాలు చాలా ముఖ్యం. అయితే… ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని బాబు కాంక్షిస్తున్నారని సమాచారం. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతేనే.. మరో దక్షిణాది రాష్ట్రం ఏపీపై దృష్టి సారిస్తారని నమ్ముతున్నారంట.
బాబుకు బీజేపీ కావాలి:
ఏపీలో బీజేపీకి ఎంతబలం ఉందనే అంశం కంటే… బీజేపీతో కలిశామన్న అంశం ముఖ్యమని బాబు బలంగా నమ్ముతున్నారు. దాన్ని ఆయన ఒక బూస్ట్ లా భావిస్తున్నారు. జాతీయపార్టీ నుంచి తనకు దొరికే పొత్తును.. ఆయన మోరల్ సపోర్ట్ గా తీసుకుంటున్నారు. అంతేకాదు… రేపు ఏపీలో ఫలితాలు అటో ఇటో అయినా… కేంద్రంలో బీజేపీ కాస్త తోడుంటుందని మరో సేఫ్ గేం ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో… బీజేపీ నేతలు మాత్రం బాబు పాచికను పారనియ్యడం లేదు!
గతం మరిచిపోలేకపోతున్న పెద్దలు:
ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి వారి హిందుత్వ విధానాలు, మత రాజకీయాలూ ఎంత కారణమో… చంద్రబాబుతో స్నేహం కూడా అంతే కారణం అని బీజేపీ పెద్దలు బలంగా నమ్ముతుంటారు. కలిసేముందు ఒకలా.. గెలిచిన తర్వాత మరోలా.. అవసరం తీరాక ఇంకోలా… చంద్రబాబు ప్రవర్తనను క్షుణ్నంగా పరిశీలించి, అనుభవించి, అభాసుపాలైన పెద్దలకు పొత్తు నచ్చడం లేదు. నోటాతో అయినా పొత్తు పెట్టుకుంటాం తప్ప.. చంద్రబాబుతో పొత్తు వద్దు అనే స్థాయికి బాబుపై వారి చికాకు పెరిగిపోయింది.
ప్రస్తుతం పొత్తు విషయంలో ఉత్తర దృవం, దక్షిణ దృవం గా ఉన్న ఈ రెండు పార్టీలు… ఎన్నికల నాటికి కలుస్తాయా.. లేదా అన్నది వేచి చూడాలి.