ఏపీలో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో కాపు సామాజికవర్గ ఓట్లు అత్యంత కీలకం కాబోతున్నాయని అంటున్నారు పరిశీలకులు. వైసీపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు వారికి ఉండగా.. టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకు వారికీ ఉంది. ఈ సమయంలో జనసేన రూపంలో కాపుల్లో రాజ్యాధికార ఆశలు పెంచిన జనసేన కు పోటీగా ఇప్పుడు కొత్తపార్టీ ఏపీలోకి ఎంటరయ్యింది. దానిపేరు… భారతీయ జనసేన పార్టీ… ఆ పార్టీ ఏపీ కమిటీ ప్రెసిడెంట్ పేరు కే పవన్ కల్యాణ్!
అవును… ఇప్పుడు ఏపీలో కొత్త పార్టీ ఎంట్రీ మొదలైంది. ఆ పార్టీ పేరు భారతీయ జనసేన పార్టీ కాగా.. ఆ పార్టీ ఏపీ చీఫ్ కోనంకి పవన్ కల్యాణ్. ఇప్పటికే ఉన్న జనసేన పార్టీ చీఫ్ పేరు కొనిదెల పవన్ కల్యాణ్. ఒక్క అక్షరం తేడా! ఇక్కడ మరో విషయం ఏమిటంటే… జనసేన సింబల్ గాజు గ్లాసు కాగా… భారతీయ జనసేన పార్టీ గుర్తు బకెట్! ఈవీఎంలపై ఇవి రెండూ దాదాపు ఒకేలా కనిపించాయని తెలంగాణలో చర్చ జరిగింది.
ఆ చర్చకు బలం చేకూరుస్తూ… కూకట్ పల్లిలో బకెట్ గుర్తుకు సుమారు 800 ఓట్ల వరకూ పోలయ్యాయి. ఇప్పటికే రోడ్డు రోలర్ గుర్తుతో తమకు చాలా నష్టం జరిగిందంటూ తెలంగాణలో బీఆరెస్స్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కొత్త జనసేన బకెట్ గుర్తు ఒక్కో నియోజకవర్గంలోనూ కనీసం వెయ్యి నుంచి రెండు వేల ఓట్లు పొందగలిగితే… అది కచ్చితంగా అధికార వైసీపీకి కలిసొచ్చే అంశమే!
ఇప్పుడు ఏపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. కూకట్ పల్లి లాంటి నియోజకవర్గంలోనే భారతీయ జనసేన పార్టీ బకెట్ గుర్తుకు 800 ఓట్ల వరకూ పోలైతే… ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆ నెంబర్ కచ్చితంగా 1000 కి పైనే ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు. ఈ సమయంలో టీడీపీ – జనసేన ఎన్నో ఆశలు పెట్టుకున్న కాపు ఓట్లపై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు!
రాబోయే ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు అత్యంత కీలకం అనేది తెలిసిన విషయమే. దీంతో చంద్రబాబు… పవన్ ని గట్టిగా పట్టుకున్నారు. అయితే సీట్లు మాత్రం 20 నుంచి 25 మాత్రమే ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే… ఇది బ్యాడ్ స్టెప్ అని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో జనసేన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ముద్రగడ రూపంలో కాపు ఓటు బ్యాంక్ లో చీలిక స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరోపక్క సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రూపంలో మరో పార్టీ రంగంలోకి రెడీ అవుతుంది. అందులో కూడా ప్రధానంగా కాపు సామాజికవర్గం నుంచి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కీలక భూమిక పోషించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే.. ఎన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకుంటే అంత బలంగా కాపు సామాజికవర్గ ఓటర్లు గాజు గ్లాసు వైపు నిలబడే అవకాశం ఉంది.
అలాకానిపక్షంలో… ఇప్పటికే టీడీపీతో పొత్తుకు అంగీకరించని వారు, సీఎంగా చంద్రబాబే ఉంటారనే స్టేట్ మెంట్ తో కలత చెందినవారు, ముద్రగడ రూపంలో విడిపోయినవారితో మరికొంతమంది పెరిగే అవకాశం ఉంది! ఇదే సమయంలో… జనసేనకు కొత్త తలనొప్పిగా అన్నట్లుగా… ఏపీలో ఎంటరైన భారతీయ జనసేన పార్టీ (బకెట్ సింబల్) తో రాబోయే కొత్త సమస్యను టీడీపీ – జనసేన ఎలా ఎదుర్కోబోతుందనేది వేచి చూడాలి!