పాదయాత్ర సందర్భంగా వైసిపిలోకి ప్రముఖ బిసి నేత మార్గాని నాగేశ్వరరావు చేరుతున్నారు. మార్గాని తూర్పుగోదావరి జిల్లాలోని బిసి నేతల్లో ప్రముఖులుగా ప్రచారంలో ఉంది. గౌడ సామాజికవర్గానికి చెందిన మార్గాని వైసిపిలో మంగళవారం చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి నుండి టిక్కెట్టు హామీ వచ్చిందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దానికితోడు రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని రాజమండ్రి అర్బన్ , రూరల్, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి నియోజకవర్గాల కన్వీనర్లు, నేతలు మద్దతు పలుకుతున్నారట. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆశీస్సులు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
మామూలుగా అయితే అసెంబ్లీ నియోజకవర్గంలోని అందరూ కీలక నేతలు ఒక పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్ధిగా ప్రపోజ్ చేయటం అరుదనే చెప్పాలి. ఎందుకంటే, ఎవరో ఒక నేతతో పార్లమెంటు ఆశావహునికి వివాదముండటం సహజం. కానీ ఇక్కడ రివర్సులో జరిగింది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కన్వీనర్లు, ఆశావహులు, నేతలు కూడా మార్గానికి పార్లమెంటు టిక్కెట్టు ఇవ్వాలంటూ సిఫారసు చేసినట్లు సమాచారం. ఎందుకంటే, మార్గాని బిసి సామాజికవర్గంలో గౌడ ఉపకులానికి చెందిన ప్రముఖుల్లో ఒకరు. అందులోను పారిశ్రామికవేత్త. ఆర్ధికంగా బాగా స్ధితిమంతుడు. కాబట్టి మార్గానికి టిక్కెట్టు వస్తే గౌడ ఉపకులం ఓట్లు వైసిపికి పడటంతో పాటు ఆర్ధికంగా తమను ఆదుకుంటాడని వైసిపి నేతలు ఆశిస్తున్నారు.
దానికితోడు రాజమండ్రి పార్లమెంటు సీటును బిసిలకు అందులోను గౌడలకు కేటాయించనున్నట్లు స్వయంగా జగనే ప్రకటించారు. అప్పటి నుండి జిల్లా నేతలు గౌడ సామాజికవర్గంలో గట్టినేత కోసం చూస్తున్నరు. ఇంతకాలానికి మార్గాని దొరికారు. కాబట్టి రాజమండ్రి ఎంపి టిక్కెట్టు దాదాపు మార్గానికే దక్కటం ఖాయమనే అనుకోవాలి. విషయం ఏమిటంటే, మార్గాని నాగేశ్వరరావు కొడుకు మార్గాని భరత్ టిడిపిలో బాగా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. నారా లోకేష్ కు భరత్ సన్నిహితునిగా ప్రచారంలో ఉంది. సమీకరణలు కుదిరితే భరత్ కు వచ్చే ఎన్నికల్లో రాజమడ్రి రూరల్ లో టిక్కెట్టిస్తామని లోకేష్ హామీ కూడా ఇచ్చారని సమాచారం. అలాంటిది ఇపుడు తండ్రితో పాటు భరత్ కూడా వైసిపిలో చేరుతుండటం తెలుగుదేశంపార్టీకి దెబ్బనే చెప్పుకోవాలి.