ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీదా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా బురద చల్లడమే పనిగా పెట్టుకున్నట్టుంది తెలుగుదేశం పార్టీ. లేకపోతే, బాక్సైట్ స్కామ్.. అంటూ నానా యాగీ చేయడమేంటి.? ప్రభుత్వం తరఫున ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చింది. అక్కడ లేటరైట్ తవ్వకాలకు పద్ధతి ప్రకారమే అనుమతులు మంజూరు చేయడం జరిగిందనీ, బాక్సైట్ తవ్వకాలకు ఆస్కారమే లేదని రాష్ట్ర ప్రభుత్వం సవివరంగా నిన్ననే పేర్కొంది.
కానీ, టీడీపీ మాత్రం ఏకంగా 15 వేల కోట్ల బాక్సైట్ స్కామ్.. అంటూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ స్కామ్ కోసమే కేవలం 24 రోజుల వ్యవధిలో అటవీ ప్రాంతంలో 14 కిలోమీటర్ల మేర 30 అడుగుల వెడల్పైన రహదారిని నిర్మించారన్నది టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపణ. విశాఖ మన్యం.. అనగానే ముందుగా బాక్సైట్ తవ్వకాల గురించిన రచ్చే జరుగుతోంది చాలాకాలంగా.
అత్యంత విలువైన బాక్సైట్ కోసం చాలా ఏళ్ళుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో కొందరు పారిశ్రామికవేత్తలు మన్యం ప్రకృతి అందాల్ని చెడగొట్టి మరీ బాక్సైట్‌ని తవ్వి, తరలించేందుకు ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. చంద్రబాబు హయాంలోనూ ఈ ప్రయత్నాలు జరిగాయి. అంతకు ముందూ ఈ ప్రయత్నాలు జరిగాయి.
నిజానికి, అక్రమంగా బాక్సైట్ తవ్వేసి గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారన్న విమర్శలూ లేకపోలేదు. ఇవి టీడీపీ హయాంలో కూడా వినిపించాయి. అత్యంత సున్నితమైన సమస్య ఇది. ఈ వ్యవహారంపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వాలు వివరణ ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. లేటరైట్ తవ్వకాల ముసుగులో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ప్రభుత్వం మరింతగా ఫోకస్ పెట్టాల్సి వుంది.