పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా మారుతున్న బండ్ల గణేష్.?

2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌పైకి సినీ నటుడు అలీని ప్రయోగించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కమెడియన్ అలీ, పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్ మీద అలీ పోటీ చేయలేదుగానీ, ఘాటైన రాజకీయ విమర్శలైతే చేశాడు.

మరి, 2024 ఎన్నికల కోసం వైసీపీ పవన్ కళ్యాణ్ విషయమై ఎలాంటి వ్యూహం పన్నుతోంది.? ఈ విషయమై సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బండ్ల గణేష్‌ని వైసీపీ రంగంలోకి దించబోతోందిట.

పవన్ కళ్యాణ్‌ని ‘దేవర’ అని పిలుస్తుంటాడు బండ్ల గణేష్. ‘తీన్‌మార్’, ‘గబ్బర్ సింగ్’ తదితర సినిమాలూ నిర్మించాడు పవన్ కళ్యాణ్‌తో. ఇంకో సినిమా నిర్మించేందుకూ సన్నాహాలు చేస్తున్నాడు బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ హీరోగా. కానీ, వ్యవహారం ఎక్కడో బెడిసి కొట్టింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద పరోక్షంగా బండ్ల గణేష్ విమర్శలు చేస్తున్నాడు. ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే పవన్ కళ్యాణ్‌కి వల్లమాలిన అభిమానం. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లనే పవన్ కళ్యాణ్‌కి బండ్ల గణేష్ దూరమైనట్లుగా ప్రచారమూ జరుగుతోంది.

సరిగ్గా, దీన్నే వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణకి అత్యంత సన్నిహితుడు బండ్ల గణేష్. ఆ బొత్స ద్వారా కథ నడిపించిందట వైసీపీ అధిష్టానం. ‘వైవీ సుబ్బారెడ్డిని సుబ్బన్నా..’ అని పిలుస్తాడట బండ్ల గణేష్.. ఇది కొత్త విషయం కదా.! మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా బండ్ల గణేష్‌కి అత్యంత సన్నిహితుడట. ఇశన్నీ కొత్త విషయాలే మరి.! సో, పవన్ కళ్యాణ్ మీద బండ్ల గణేష్ విమర్శలు చేసే రోజు అతి త్వరలో రాబోతోందన్నమాట.