మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇష్యూ అధికార వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా “రీజనల్ కో ఆర్డినేటర్” పదవికి రాజీనామా చేయటంపై ఈ చర్చ మరింత జోరందుకుంది. రెండోదఫా క్యాబినెట్ విస్తరణలో మళ్లీ తనకు చోటు దక్కకపోవడం.. అంతకంటే ఎక్కువగా, ఆదిమూలపు సురేష్ కి రెండోసారి కూడా మంత్రి పదవి దగ్గడంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యారు బాలినేని. అయితే బాలినేని అలకకు అసలు కారణం అది కాదని తెలుస్తుంది.
అవును… వైసీపీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలకకు అసలు కారణం మంత్రి పదవి కాదని, రీజనల్ కో ఆర్డినేటర్ పదవే అని స్పష్టమవుతుందట. అయితే ఈ సమస్య ఒక్క బాలినేనికి మాత్రమే పరిమితం కాదని తెలుస్తుంది. బాలినేని బయటపడ్డారు.. మిగిలిన వారు లోలోపల మథనపడిపోతున్నారట. అయితే జగన్ తో ఉన్న సాన్నిహిత్యం, పార్టీలో ఉన్న సీనియార్టీ మేర బాలినేని బయటపడిపోగలిగారు.. మిగిలినవారు పంటికింద బిగపట్టి భరిస్తున్నారట.
అవును… రీజనల్ కో ఆర్డినేటర్ గా పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడం అంత తేలిక కాదని అంటున్నారట సీనియర్ నేతలు. అలా అని జగన్ ఇచ్చిన బాధ్యతను కాదనలేమని ఆఫ్ ద రికార్డ్ వాపోతున్నారంట. కారణం… మిగిలిన నియోజకవర్గాలపై మనసుపెడితే.. సొంత నియోజకవర్గంలో చక్కబెట్టడం ఇబ్బందవుతుందని అంటున్నారంట. ఇది కేవలం బాలినేని సమస్య మాత్రమే కాదు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న 12 మంది రీజనల్ కో ఆర్డినేటర్లలో ఇద్దరు మంత్రులు ఉంటే.. మిగిలిన వారు ఎంపీ, ఎమ్మెల్యే లాంటి ఇతర బాధ్యతలు ఉన్న వారే. దీంతో మెజారిటీ రీజనల్ కో ఆర్డినేటర్ లు, తమ తమ బాధ్యతకు న్యాయం చేయటంలేకపోతున్నారంట.
అయితే బాలినేని ఇలా బయటపడి చెప్పడంతో.. మిగిలిన కో ఆర్డినేటర్లు హ్యాపీ ఫీలవుతున్నారని తెలుస్తుంది. ఇకపై అయినా జగన్ తమ పరిస్థితిని అర్ధం చేసుకోవాలని చెప్పుకుంటున్నారట. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సొంత నియోజకవర్గంలో చక్కబెట్టాల్సిన పనులు పెండింగ్ లో పడిపోతున్నాయని వాపోతున్నారంట. మరి వీరి బాదను జగన్ అర్ధం చేసుకుంటారా? లేక, సీనియర్లు అన్నాక ఆ మాత్రం సర్ధుకోలేకున్నారా అని ఎదురు ప్రశ్నిస్తారా? అన్నది వేచి చూడాలి!