బాలయ్య నియోజకవర్గం మారుతుందా.?

2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లోనూ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నుంచి హిందూపురం అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లోనూ అక్కడే గెలిచి, హ్యాట్రిక్ కొడతానన్నది నందమూరి బాలకృష్ణ పదే పదే చెబుతున్నమాట.

అయితే, హిందూపురం నియోజకవర్గంలో ఈక్వేషన్స్ మారుతున్నాయట. నందమూరి బాలకృష్ణ ఈసారి హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశం లేదంటూ టీడీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ ఈసారి హిందూపురం నుంచి కాకుండా, ఎన్టీయార్ జిల్లా నుంచి పోటీ చేయొచ్చునని అంటున్నారు.

ఎందుకు.? ఏంటి.? అన్నదానిపై ఇంకాస్త స్పష్టత రావాల్సి వుంది. ఈసారి హిందూపురంలో టీడీపీ గెలుపు అంత ఈజీ కాదు. పైగా, నందమూరి బాలకృష్ణ, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వుండడంలేదన్న విమర్శ కూడా వుంది.

ఈ నేపథ్యంలోనే బాలయ్య కూడా నియోజకవర్గ మార్పుకి అన్యమనస్కంగానే ‘సరే’ అన్నారట. ప్రస్తుతం బాలయ్య ఎక్కడి నుంచి పోటీ చేస్తే బావుంటుందన్న విషయమై టీడీపీలో కొందరు నేతలు ప్రత్యేకించి మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీయార్ జిల్లా అయితేనే సేఫ్.. కానీ, ఏ నియోజకవర్గం.? అంటూ ఆ టీడీపీ నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారట. తెరవెనుకాల చిన్నపాటి సర్వే కూడా షురూ అయ్యిందని అంటున్నారు.

2024 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే, ఈసారి నందమూరి బాలకృష్ణ మంత్రి అయ్యే అవకాశం కూడా వుందట. నిజమేనా.? నమ్మొచ్చా.? బావమరిదిని చంద్రబాబు తన మంత్రి వర్గంలోకి తీసుకుంటారా.?