ఎన్టీవోడిని పొగుడుతున్నారా.? తిట్టిస్తున్నారా.?

ఎన్టీయార్ అంటే తెలుగు జాతి వెన్నెముక.. అంటున్న బాలయ్య.! మరి, అలాంటి ఆ వెన్నెముకని విరిచేసిందెవరో కూడా కాస్త విడమరచి చెప్పవయ్యా.!ఎన్టీయార్ అన్నది ఓ పేరు కాదు.! పేరు కాకపోతే ‘బూతు’ అవుతుందా.? అలాగనేశావేంటి బాలయ్యా.!ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. అంటున్న బాలయ్య.! అంటే, ఎన్టీయార్ ఈ తెలుగు నేల మీద పుట్టకముందు తెలుగు జాతికి ఓ సంస్కృతి, నాగరికత అనేదే లేదంటావ్.. అంతే కదా.?

సోసల్ మీడియాలో నెటిజనం మాత్రమే కాదు, రచ్చ బండ మీద, టీ దుకాణాల వద్దా.. ఇదిగో ఇలాగే చర్చించుకుంటున్నారు తెలుగు ప్రజానీకం. ఇంతకీ, తెలుగు ప్రజలంటే ఎవరు.? కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలేనా, తెలంగాణ ప్రజలు కూడానా.? అన్న ప్రశ్న కూడా తెరపైకొస్తోంది.

ఎన్టీయార్ ఒకవేళ తెలుగు జాతి వెన్నెముక అయితే.. అంతకు ముందు తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయులుగా పేరొందిన పింగళి వెంకయ్య తదితరుల్ని ఏమనాలి.? అన్న ప్రశ్న తెరపైకి రావడంలో వింతేముంది.?

వ్యవహారిక భాషోద్యమకారుడైన గిడుగు రామ్మూర్తి పంతులు.. తెలుగువారికి ఓ ప్రత్యేక రాష్ట్రం వుండాలని నినదించి, ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు.. తెలుగు నేలపై పోరాట స్ఫూర్తిని నింపిన అల్లూరి సీతారామరాజు.. వీళ్ళందర్నీ ఏమనాలి చెప్మా.? గురజాడ అప్పారావు పరిస్థితేంటి.? రాస్తే, ఈ లిస్టు చాంతాడంత వుంటుంది.!

స్వర్గీయ ఎన్టీయార్, తెలుగు నాట గొప్ప నటుడు.. పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చారు.. తెలుగు రాజకీయాల్ని తనదైన శైలిలో ప్రభావితం చేశారు. తెలుగు రాజకీయాలపై తనదైన ముద్ర బలంగా వేశారు. ఇందులో నో డౌట్.!

కానీ, ఎన్టీయార్ పేరు చెప్పి, తెలుగు జాతి ఆత్మగౌరవం.. అప్పడాల కర్ర.. అనడమే సబబు కాదు.! అసలు ఇలాంటి చర్చకు ఆస్కారమివ్వడమంటేనే ఎన్టీయార్‌ని అవమానించడం. అలా చేసింది స్వయానా ఆయన పుత్రరత్నం నందమూరి బాలకృష్ణే. తండ్రి గురించి గొప్పలు చెప్పే క్రమంలో పది మంది చేత తన తండ్రిని తిట్టించడమేంటి.. ఇదా పుత్రుడిగా, తండ్రికి ఇచ్చే గౌరవం.?