సినిమాల్లో మాస్ డైలాగులను తనదైన స్టైల్లో చెప్పడంలో బాలయ్యకు బాలయ్యే సాటి అనేది అంతా చెప్పే మాట. సినిమాల్లో ప్రత్యర్థులపై ఆయన చేసే మాస్ డైలాగుల దాడి పీక్స్ లో ఉంటుంది. ఇక అదే ఊపుని కంటిన్యూ చేసే పనిలో ఉన్నారో.. లేక, నిజంగానే బాగా హర్టయ్యారో తెలియదు కానీ… వైసీపీ ఎమ్మెల్యేపై పరోక్షంగా సీరియస్ అయ్యారు బాలయ్య!
అవును… తాజాగా ఒక సినిమా అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న బాలకృష్ణ వైసీపీ ఎమ్మెల్యేకి తన స్టైల్లో హెచ్చరికలు జారీ చేశారు. “నేను చిటికేస్తే ఏం జరుగుతుందో తెలుసుకో.. మూడో కన్ను తెరిచానంటే ఏమవుతుందో చూస్కో.. ” అంటూ బాలయ్య సింహావతారం ఎత్తినట్లు డైలాగులేశారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఆయన పరోక్షంగా ధ్వజమెత్తారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో.. ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కార మహోత్సవం జరిగింది. ఇందులో భాగంగా… బాలకృష్ణ చేతుల మీదుగా సావిత్రి కుమార్తె చాముండేశ్వరి, నిర్మాత నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథ రెడ్డికి ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య నర్సరావుపేట ఎమ్మెల్యేకి ఈ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు.
ఇంతకూ ఏమి జరిగిందంటే… ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ సినిమా పాటల్ని పెట్టారు నిర్వాహకులు. ఆ పాటలు వస్తుండగా వాటిని వెంటనే ఆపేయాలంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ విషయం టీడీపీ నాయకులకు తెలిసింది. వారు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన బాలయ్య… తాను ఒక కులం వారికోసమో, ఒక పార్టీ వారికోసమో సినిమాలు చేయట్లేదని, సినిమావాళ్లంతా ప్రజలందరికోసమే నటించి రంజింప జేయాలనుకుంటారని అన్నారు. అనంతరం… రాజకీయాలకి, సినిమాలకి ముడిపెట్టొద్దని సూచించిన బాలయ్య… రాజకీయాల్లో చూసుకుందాం రండి, సినిమాలపై మీ ప్రతాపమేంటి అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా హల్ చల్ చేస్తుంది!