అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీలో ఆయన వారసులు కీలక భూమిక పోషించకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారని.. ఇందులో భాగంగానే హరికృష్ణకు జరిగిన అవమానాలాని చెబుతుంటారు. ఇదే సమయంలో బాలయ్యను కూడా వియ్యంకుడిగా చేసుకుని గ్రిప్ లో పెట్టుకున్నారని అంటారు. ఫలితంగా… అన్నగారు స్థాపించిన పార్టీలో ఆయన వారసులు ఆటలో అరటిపండు అయిపోయారని అభిమానులు ఆవేదన చెందుతుంటారు.
టీడీపీలో నందమూరి వారసుల పాత్ర 12త్ మేన్ పాత్రే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంటుంది. వారు ఉన్నా లేకున్నా పార్టీకి ఏమీ ఫరక్ పడదు అనేది పలువురి అభిప్రాయం కావొచ్చు. నందమూరి లక్ష్మీపార్వతి కూడా ఇదే విషయంపై నిత్యం ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ ని కూడా దూరం పెట్టిన విధానాన్ని ఆమెతో పాటు నందమూరి అభిమానులు నిత్యం తప్పుబడుతుంటారు.
ఈ సమయంలో నందమూరి బాలకృష్ణ టీడీపీ ఆఫీసులో మెయిన్ ఛైర్ లో కూర్చున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ కలలు కన్నది ఇదే కదా.. తన తర్వాత తన వారసులు కదా ఆ కుర్చీలో కుర్చోవాల్సింది అని ఆయన కోరుకున్నారని.. ఇప్పుడు ఆ దృశ్యం ఆవిష్కరించబడిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు తెగ షేర్ చేస్తున్నారు.
వివరాళ్లోకి వెళ్తే… ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయన బావమరిది బాలకృష్ణ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో.. పార్టీ ఏం చేయాలన్నదానిపై సాయంత్రం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నేతృత్వం వహించారు.
వాట్ నెక్స్ట్ అనే విషయంపై అందుబాటులో ఉన్న నేతలందరితోనూ మాట్లాడారని తెలుస్తుంది. ఈ సందర్భంగా అందరి అభిప్రాయాలూ పూర్తిగా విన్న బాలయ్య.. కొన్ని వ్యూహాత్మక ప్రకటనలు చేశారని అంటున్నారు. దీంతో… ఇంత ఓపెన్ గా, ఇంత తెలివిగా బాలయ్య ఆలోచిస్తారని తాము అనుకోలేదని పలువురు టీడీపీ నేతలు చర్చించుకున్నారని తెలుస్తుంది. దీంతో… చంద్రబాబుకు బెయిల్ రాకపోతే ఆ స్థానంలో బాలయ్య కొనసాగితేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది.
అయితే చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న వాదన ఇప్పటికే పార్టీలో ఉందని చెబుతుంటారు. ఇదే సమయంలో ఆ విషయంలో కొంత వ్యతిరేకత కూడా ఉందని అంటారు. ఇప్పటివరకు లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదని, అనుభవం కూడా అంతంత మాత్రమేనని అభిప్రాయం పార్టీ సీనియర్లలో ఉందని చెబుతుంటారు.
ఈ సమయంలో కాస్త అనుభవం, ఫాలోయింగ్ ఉన్న నాయకుడు టీడీపీకి కావాలనే చర్చ మొదలైందని తెలుస్తుంది. అది బాలయ్యే ఎందుకు కాకూడదన్నది టిడిపిలో ఓ వర్గం ఆశ అట. అసలు అన్నగారి వారసుడిగా ఈ స్థానానికి బాలయ్య కంటే అర్హుడు ఎవరు అనే చర్చ కూడా సాగుతుందట. దీంతో… బాలయ్య ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.