బాలయ్యా.. పేరుకే టీడీపీ ఎమ్మెల్యే. కానీ టీడీపీ వ్యవహారాల్లో అస్సలు తలదూర్చరు. ఎన్ని వివాదాలు రేగుతున్నా తనకు సంబంధం లేదన్నట్టు ఉంటారు. నందమూరి కుటుంబం నుండి పార్టీలో ఉన్న ఏకైక వారసుడిగా ఆయన మీద అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు చంద్రబాబుకు ధీటుగా పార్టీలో ఎదురుతారని అంతా భావించారు. కానీ అలాంటివేం జరగలేదు. అసలు ఆయన పార్టీలో ఉన్నారా లేరా అన్నట్టే ఉంటున్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాల్లో అయినా తన వాగ్ధాటి చూపించి పార్టీలో ప్రముఖంగా మారతారని అనుకుంటే ఏ అమావాస్యకో పున్నమికో నోరు తెరిచి నాలుగు మాటలు మాట్లాడతారు.
సరే పార్టీలోని అంతర్గత వ్యవహారాల సంగతి అటుంచితే బహిరంగ రాజకీయాల్లో అంటే ప్రత్యర్థి పార్టీలతో తలెత్తే సమస్యల్లో అయినా హీరోయిజమ్ చూపట్లేదు ఆయన. అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్ మాటలను అస్సలు పట్టించుకోని ఆయన ఇప్పుడు ప్రతిపక్షం స్థానంలో పార్టీ నానా అవస్థలు పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. పాత పద్దతిలోనే ఎప్పుడో కానీ స్పందించట్లేదు. ఈమధ్య రాజకీయంగా ఏపీలో అనేక ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దేవాలయాల మీద దాడులు నిత్యకృత్యాలు అయిపోయాయి. బిట్రగుంట నుండి రామతీర్థం రాములవారి విగ్రహం ధ్వంసం వరకు చాలానే జరిగాయి. వీటన్నింటికీ కారణం టీడీపీ కుట్రలేనని అధికార పక్షం అంటోంది. దేవుడంటే అమితమైన భక్తి కలిగిన బాలయ్య ఈ వివాదాల్లో కూడ స్పందించకపోతే ఏమనుకోవాలి.
సరే.. దేవుళ్ళ వరకు ఎందుకు.. సొంత అల్లుళ్ళనే టార్గెట్ చేసినా ఆయన నోరు విప్పట్లేదు. నారా లోకేష్ మీద విజయసాయిరెడ్డి, కొడాలి నాని ఎలా పేలుతుంటారో చెప్పనక్కర్లేదు. రోజులో కనీసం ఒక్కసారైనా లోకేష్ మీద సెటైర్లు వేయకుంటే నిద్రపట్టదు వారికి. ఇక చిన్నల్లుడు శ్రీభరత్ గీతం ఆక్రమణల ఆరోపణల వలన ఎంత ఇబ్బందిపడుతున్నారో తెలుసు. అయినా బాలయ్యలో కదలిక లేదు. చాలారోజుల తర్వాత హిందూపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ఆలయాల ధ్వంసం మీద, పేకాటకు సంబంధించి కొడాలి నాని వ్యాఖ్యల మీద ముక్తసరిగా నాలుగు మాటలు మాట్లాడి పాలకవర్గానికి రెండు హెచ్చరికలు వదిలారు. అంతే ఇంకో నాలుగైదు నెలలు ఆయన నోరు తెరవరు.
ఈపద్ధతిని చూస్తున్న టీడీపీ శ్రేణులు బాలయ్యా నీ బండి జీవితకాలం లేటయ్యా. టైమింగ్ అస్సలు ఉండట్లేదు అంటున్నారు. కాబట్టి ఎమ్మెల్యేగా నియోజకవర్గం బాధ్యతల్లో, చైర్మన్ గా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కార్యక్రమాల్లో, హీరోగా సినిమా పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూసుకుంటున్న బాలకృష్ణ తరచూ పార్టీ విషయాల్లో కూడ కలుగజేసుకుని ప్రత్యర్థుల మీద పోరాడితే బాగుంటుంది మరి.