చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా ఈ తీర్పు వెలువరించింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ 7691గా ఉన్నారు. ఇదే సమయంలో మరోపక్క అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసు కూడా తెరపైకి వచ్చింది. దీంతో బాబు బయటరకు రావడంపై తీవ్ర చర్చ నడుస్తుంది.
అలాంటప్పుడు పార్టీ పరిస్థితి ఏమిటి అనేది తమ్ముళ్లలో బలంగా మెదులుతున్న ప్రశ్న. బాబు లోపలే ఉంటే, చినబాబు జైలు బయటే ఉండి భోజనాలూ గట్రా సప్లై చేస్తుంటే పార్టీ పరిస్థితి ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది. సరిగ్గా ఈ సమయంలో చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ లైన్లోకి వచ్చారు.
తాజాగా ఏపీ టీడీపీ అధినేత కూర్చునే సీటు ఖాళీగా ఉండటంతో కెప్టెన్ లేని షిప్ లా పార్టీ పరిస్థితి మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తాజాగ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా నిలిచాయి. “ఇక నేనే ముందుంటా..” అని బాలయ్య ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
సోమవారం నుంచే టీడీపీ ఆఫీస్ లో సీనియర్ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్న బాలకృష్ణ.. ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ తో పలువురు షాక్ తో చనిపోయారని, కొందరికి టెన్షన్ లో గుండెపోటు వచ్చిందని, మరికొందరు తీవ్ర మస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారని వారి కుటుంబాలను తానే స్వయంగా వెళ్లి పరామర్శిస్తానని చెప్పారు.
ఇదే క్రమంలో… ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని.. తాను వస్తున్నానని, తానే ముందుంటా అని అంటూ పార్టీ శ్రేణులకు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఇకపై తెలుగువాడి సత్తా ఏంటో చూపిద్దామని అన్నారు. జగన్ కేవలం కుట్రపూరితంగానే చంద్రబాబుపై కేసు పెట్టారని, త్వరలోనే కడిగిన ముత్యంలా బాబు బయటకు వస్తారని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
దీంతో ఏపీ టీడీపీ శ్రేణుల్లో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం టీడీపీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ అనే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో… ఒకవేళ చంద్రబాబు కోసం చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలంటే ఆ బాధ్యత లోకేష్ తీసుకోవాలి కదా అని అంటున్నారు పరిశీలకులు.
కానీ, బాలకృష్ణ తానే ఓదార్పు యాత్ర చేసి వస్తా అని చెప్పడం చూస్తుంటే… చంద్రబాబు ఇప్పట్లో బయటకు రారా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో తన తండ్రి స్థాపించిన పార్టీపై బాలయ్య కన్నేశారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.