Balakrishna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి అని కూడా నిరూపించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడుసార్లు విజయం అందుకున్న సంగతి మనకు తెలిసిందే. బాలకృష్ణ హిందూపురంలో ఎక్కువగా ఉండకపోయినా తన ప్రతినిధుల చేత అక్కడ ప్రజల అవసరాలన్నింటినీ కూడా తీరుస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు దీంతో అక్కడ బాలయ్యకు ఎంతో మంచి క్రేజ్ ఉంది.
ఇకపోతే బాలకృష్ణ ఆంధ్ర ప్రజల కోసం చక్కని శుభవార్త తెలిపారు. ప్రస్తుతం హైదరాబాదులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక్కడ అత్యంత తక్కువ ధరకు దాదాపు ఉచితంగానే క్యాన్సర్ కి చికిత్స అందిస్తూ ఉన్నారు. క్యాన్సర్ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యం అంత ఖర్చును పేదలు భరించలేరన్న ఉద్దేశంతోనే బసవతారకం హాస్పిటల్ ద్వారా బాలకృష్ణ ఎంతోమంది పేదవారికి ఈ వైద్యసేవలను అందిస్తున్నారు.
ఇక ఈ హాస్పిటల్ కి పెద్ద ఎత్తున ఎన్నారైల నుంచి విరాళాలు వస్తుంటాయి అలాగే బాలకృష్ణ తన ప్రమోషన్ కోసం తీసుకునే రెమ్యూనరేషన్ అంత హాస్పిటల్ కోసమే కేటాయిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పేదవారు అక్కడికి వెళ్తున్నారు అయితే ఇకపై ఆంధ్ర వాసులకు హైదరాబాద్ వచ్చే పని లేకుండా అమరావతిలోనే బసవతారకం హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే ఈ హాస్పిటల్ కి సంబంధించి సుమారు 15 ఎకరాల స్థలం కూడా కేటాయించారు.ఇటీవల జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేశారు. అయితే ఆ స్థలంలో హెచ్‌టీ కరెంట్ తీగలు ఉండటంతో అండర్ గ్రౌండ్ ద్వారా వాటిని రీప్లేస్ చేసేందుకు పనులు చేపట్టనున్నారు. వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఈ హాస్పిటల్ నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. జనవరి నుంచి ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం.