ముందస్తు బెయిల్ కోసం మళ్ళీ అవినాశ్ రెడ్డి పోరాటం.!

సీబీఐ నుంచి అరెస్టు భయం పొంచి వుంది. నిజానికి, సీబీఐ గనుక అరెస్టు చేయాలనుకుంటే.. ఇంతకాలం ఆగేది కాదు ఆ అరెస్టు వ్యవహారం. కానీ, ఆగుతోంది. దీనర్థమేంటో తలపండిన రాజకీయ నాయకులకీ అర్థం కావడంలేదు. రాజకీయ విశ్లేషకులూ, మాజీ ఐపీఎస్ అధికారులూ ముక్కున వేలేసుకుంటున్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టవుతారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. సీబీఐ వర్సెస్ అవినాశ్ రెడ్డి.. క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తోంది. ముందస్తు బెయిల్ వద్దంటోంది సీబీఐ. పోనీ, అవినాశ్ రెడ్డిని అరెస్టు చేస్తోందా.? అంటే అదీ లేదు.

విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు పంపడం, తనకు తీరిక లేదని సీబీఐకి అవినాశ్ రెడ్డి సమాధానం చెప్పడం.. ఇదంతా ఓ ప్రసహనంగా మారింది. గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.

తాజాగా, మద్యంతర బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19న విచారణకు హాజరవుతానని సీబీఐకి అవినాశ్ రెడ్డి సమాధానం ఇచ్చిన దరిమిలా, ఈలోగా ఆయనకు సుప్రీం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా.? లేదా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం, గౌరవం పోతున్నది ఇలాంటి సందర్భాల్లోనే.