విజయవాడ రాజకీయాల్లో.. ప్రధానంగా బెజవాడ ఎంపీ సీటు విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య రసవత్తర పొరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అన్నదమ్ముళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందన్నా అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం వైసీపీ నుంచి అన్న కేశినేని నాని.. టీడీపీ నుంచి తమ్ముడు కేశినేని చిన్నిలు ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతారని నిన్నటివరకూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే… ఇప్పుడు ఇద్దరికీ సమస్య వచ్చేలా ఉందనే చర్చ తెరపైకి వచ్చింది.
విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో… కేశినేనికి అదేస్థానం నుంచి వైసీపీ తరుపున పోటీకి రెడీ అని ప్రకటనలు వచ్చాయి! అయితే… తాజాగా చేయిస్తున్న సర్వేల్లో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా… ఈసారి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో బెజవాడ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి.
ఈ క్రమంలో మొండితోక అరుణ్ కుమార్ పేరుతో పార్టీ సర్వే చేయిస్తోందని తెలుస్తుంది. అది సక్సెస్ అయ్యి మార్పు అనివార్యమైతే… కేశినేని నానిని ఎంపీ సీటు బదులు ఆయన కుమార్తె శ్వేతకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తుంది. అందులో భాగంగా విజయవాడ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పలు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో కేశినేని నాని నుంచి అభ్యంతరాలు లేవని.. తనకు టిక్కెట్ ఇచ్చినా, తన కుమార్తెకు టిక్కెట్ ఇచ్చినా ఓకే అని చెబుతున్నారని సమాచారం.
ఆ సంగతి అలా ఉంటే… మరోపక్క టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఈసారి విజయవాడ ఎంపీ టిక్కెట్ తనదే అని కేశినేని చిన్ని & కో ఫుల్ హల్ చల్ చేస్తున్నారని అంటున్నారు. అయితే… ఈ విషయంలో చంద్రబాబు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం లేదని, లోకేష్ బలవంతమే తప్ప ఆయనకు మాత్రం విజయవాడ లాంటి కీలక నియోజకవర్గంలో రిస్క్ చేయడం ఏమాత్రం ఇష్టం లేదని అంటున్నారని చర్చ జరుగుతుంది.
పైగా… నానికి టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకున్నా… ఆయన ప్రభావం అక్కడ పుష్కలంగా ఉంటుందనే ఆందోళనలు తమ్ముళ్లలో వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ సిట్టింగ్ సీటైన విజయవాడను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని.. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని స్థానంలో గద్దె రామ్మోహన్ ను బరిలోకి దించాలని యోచిస్తున్నారని తెలుస్తుంది.
వాస్తవానికి 1999లో గద్దె రామ్మోహన్ విజయవాడ ఎంపీగా టీడీపీ తరఫున విజయం సాధించారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన గద్దె రామ్మోహన్ కు వివాద రహితుడిగా, సౌమ్యుడిగా, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా కూడా పేరుంది. అంతేకాకుండా గతంలో ఒకసారి ఎంపీగానూ పనిచేసిన అనుభవం కూడా ఉండటంతో చంద్రబాబు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.
మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్ని పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు కూడా బాబు వద్ద ఆప్షన్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న గద్దే స్థానంలో చిన్నికి అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అదే జరిగితే… అన్నాదమ్ముళిద్దరికీ ఆశించిన స్థానాలు దక్కనట్లే భావించాలి!! మరి విజయవాడ తూర్పు సీటు అయినా చిన్నికి దక్కుతుందా.. లేక, చివరి నిమిషంలో ఎమ్మెల్సీ లాంటి ఆఫర్స్ ఏమైనా చేస్తారా అనేది వేచి చూడాలి!!