Ayyanna patrudu Arrest: అయ్యన్నపాత్రుడి అరెస్ట్.! ఆయన కోరిక ఫలించినట్లేనా.?

Ayyanna

Ayyanna patrudu Arrest: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ నిన్న అర్థరాత్రి అరెస్టు చేసింది. అయినా, అర్థరాత్రి అరెస్టులేంటి.? పైగా, దొంగల్లా పోలీసులు గోడ దూకి రాజకీయ నాయకుల్ని అరెస్టులు చేయడమేంటి.? అన్న విమర్శ టీడీపీ నుంచి వస్తోంది.

సరే, పోలీసులు ఏం చేయాలి.? ఏం చేస్తే, ఆ తర్వాత పోలీసులు కోర్టుల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.? ఇదంతా వేరే చర్చ.

అయ్యన్నపాత్రుడు అక్రమంగా తన ఇంటిని నిర్మించుకున్నారనే కేసు వుంది. ఆ కేసులో ఆయన ఇదివరకే అరెస్టు కావాల్సింది. అప్పట్లో నానా యాగీ జరిగింది. ‘బస్తీ మే సవాల్.. దమ్ముంటే నన్ను అరెస్టు చేయండిరా..’ అంటూ అయ్యన్న పాత్రుడు అప్పట్లో ప్రభుత్వ పెద్దలకీ, పోలీసు వ్యవస్థకీ సవాల్ విసిరారు.

ఇంతలోనే అయ్యన్న పాత్రుడు అరెస్టయ్యారు. అర్థరాత్రి, పట్ట పగలు.. ఈ అంశాల్ని పక్కన పెడితే, అయ్యన్న పాత్రుడు ఏం కోరుకున్నారో అదే జరిగింది. వ్యవస్థలకి రాజకీయ నాయకులు సవాళ్ళు విసరకూడదు. దురద‌ష్టం రాజకీయ నాయకులు వ్యవస్థల్ని సవాల్ చేయడమే కాదు, తమకు అధికారం వచ్చిన్పపుడు ఆ వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుంటున్నారు కూడా.

పోలీసులు, అయ్యన్న పాత్రుడిని దుర్భాషలాడారంటోంది ఆయన కుటుంబం. మరి, అయ్యన్న పాత్రుడి దుర్భాషల మాటేమిటి.? పోలీసులు తప్పతాగి వచ్చారంటూ అయ్యన్న పాత్రుడి సతీమణి ఆరోపిస్తున్నరు. పోలీసులు అలా చేస్తారా.? ఈ విషయమై పోలీసు శాఖ స్పందించాలి.. తప్పుడు ఆరోపణలు చేస్తే, ఆమెపై కేసు నమోదు చేయాలి కూడా.!
ఒక్కటి మాత్రం నిజం. ఈ అరెస్టుతో అయ్యన్న పాత్రుడికి వచ్చే నష్టమేమీ లేదు. కాకపోతే, ఆయనకు పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందంతే.!