ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఊహించని అనుభవం ఎదురైంది. దీంతో ఆయన సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన పూదోటను అభివృద్ధి చేయాలని పాలకమండలి నిర్ణయించింది.
ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉదయం 9.15 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని అవంతికి సమాచారం అందించారు. అయితే ఆయన వేరే కార్యక్రమంలో పాల్గొని 10.10 గంటలకు అక్కడకు చేరుకున్నారు.
అయితే అప్పటికే విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, అరకు ఎంపీ మాధవి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ తదితరులు మొక్కలు నాటి వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న అవంతికి పాలకమండలి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలకబోయారు. దీనితో అతిథుల గురించి అవంతి ఆరాతీయగా వెళ్లిపోయారని సమాధానమిచ్చారు. వారు ఉదయాన్నే రావడంతో వారితో మొక్కలు నాటించేశామని చెప్పారు. దీంతో, వారిపై అవంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వచ్చేంత వరకు ఆగలేకపోయారా? అని మండిపడ్డారు. కనీసం ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం కూడా లేదా? అని నిలదీశారు. తనకు వీడియో కాన్ఫరెన్స్ తో పాటు మరో కార్యక్రమం కూడా ఉందని చెప్పి… కారు దిగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు