ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ (సూపర్ సిక్స్ ఎన్నికల హామీ) పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నా, ఈ పథకం ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో, తమను ఆదుకోవాలని కోరుతూ విజయవాడలో ఆటో డ్రైవర్లు ఇవాళ భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
ఉచిత బస్సు పథకం నేపథ్యంలో తమకు కొత్త పథకం అమలు చేస్తామని ప్రభుత్వం మోసం చేసిందని ఆటో డ్రైవర్లు ఆరోపించారు. బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చే పాలకులు ఆటో కార్మికులకు ఎందుకు ఇవ్వరని వారు ప్రశ్నించారు. ఓలా, ఉబర్, రాపిడో వంటి బడా కంపెనీల యాప్లు, గ్యాస్, ఇన్సూరెన్స్ రేట్ల పెంపు, పోలీసు, రవాణా శాఖల పెనాల్టీలతో ఆటో రంగం కుదేలైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో పెద్ద ఎత్తున ఆటోలతో ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేశారు.
ఆటో డ్రైవర్లు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు:
ఉచిత బస్సు సదుపాయంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికులందరికీ రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించాలి.
వడ్డీ లేని ఆటో రుణాలు ఇవ్వాలి.
ఓలా, ఉబర్, రాపిడో వంటి సంస్థల దోపిడీని అరికట్టాలి.
ఆటో గ్యాస్, ఇన్సూరెన్స్ రేట్లలో రాయితీలు కల్పించాలి.
పోలీసు, రవాణా శాఖ పెనాల్టీలను పెంచిన జీవో 21ని రద్దు చేయాలి.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉచిత బస్సు పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ స్త్రీ శక్తి పథకం, ఆటో కార్మికులను ఆదుకునే సంక్షేమ పథకం కలగలిపి అమలు జరపాలని వారు కోరారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, వాహన మిత్ర మొత్తాన్ని పెంచుతామని, పెనాల్టీలు వేసే జీవో 21 రద్దు చేస్తామని, రుణాలు అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. “ఖాకీ చొక్కా వేసుకుని ఆటో తోలి కార్మికులకు అండగా నిలుస్తామని నాడు మాట ఇచ్చిన నేతలు మోసం చేయటం తగదు” అని వారు అన్నారు. ఆటో కార్మికులను ఆదుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


