ఆర్టీసీ డ్రైవర్‌ పై దాడి… నిందితుల్లో “తమ్ముళ్లు”, వారి మిత్రులు!

కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌ రాం సింగ్ పై జరిగిన దారుణమైన దాడి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ దాడి పూర్తిగా వైసీపీకి సంబంధించినవారే చేయించారని నారా లోకేష్ చెప్పుకొచ్చారు! దానికి జనసేన నేతలు తందానతాన అన్నారు! అయితే… ఈ ఆరోపణలు చేసిన 24 గంటల్లోనే వాస్తవాలు బహిర్గతం అయ్యాయ్యి. ఇందులో భాగంగా… ఆ నిందితులు ఎవరు.. ఏ పార్టీకి చెందిన వారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి!

ఆర్టీసీ డ్రైవర్‌ రాం సింగ్ పై జరిగిన దాడిలో నిందితుల బ్యాక్ గ్రౌండ్ తెరపైకి వచ్చింది. ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న 14 మంది నిందితుల్లో 7గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా… పుట్టా శివకుమార్‌ రెడ్డి, బండి విల్సన్, కుప్పాల వంశీ, షేక్‌ కలీం చోటు, షేక్‌ ఖాజావలి, షేక్‌ ఇలియాజర్, షేక్‌ బాజీలను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. మిగతా ఏడుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారని తెలుస్తుంది.

ఇలా పోలీసులు అత్యంత వేగంగా స్పందించిన విధానంపై అటు ప్రజల నుంచి, ఇటు ఆర్టీసీ యూనియన్ల నుంచీ హర్షం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా… ముఖ్యమంత్రి జగన్‌ తోపాటు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఆర్టీసీ యూనియన్లు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. ఘటన అనంతరం 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేయడం వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ నిందితులుపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగా… దేవరకొండ సుధీర్ పై కావలి స్టేషన్ లో 14 కేసులు, ఇతర జిల్లాల్లో 7 కేసులు ఉండగా… గుర్రంకొండ కిషోర్ పై 10 కేసులు, గుర్రంకొండ అరున్ కుమార్ పై 2 కేసులు, కర్రెద్దుల విజయ్ కుమార్ పై 9 కేసులు, పుట్టా శివకుమార్ రెడ్డిపై 8 కేసులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇదే సమయంలో ఆర్టీసీ డ్రైవర్‌ పై కావలిలో దాడి చేసిన రౌడీలంతా.. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారేనని స్థానిక ప్రజలు స్పష్టం చేస్తున్నారు. దాడి చేసిన రౌడీలు “ఐ సపోర్ట్‌ బాబు” బ్యానర్లు చేతపట్టి గతంలో ఫోటోలకు ఫోజులివ్వగా.. మరొకరు జనసేన జెండా కప్పుకోగా.. మరొకరు బీజేపీ నేత అనుచరుడని చెబుతున్నారు. వీరికి ఆ రాజకీయ పార్టీలతొ ఉన్న అనుబంధానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో.. నిన్నటివరకూ ఈ దాడిని అధికార వైసీపీకి అంటగడుతూ ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు… ఈ వివరాలు, ఇందుకు సంబంధించిన ఫోటోలు వెలుగులోకి రావడంతో వీరంతా కలుగుల్లో దూరారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకోకుండా లోకేష్, పవన్‌ కల్యాణ్‌ లు ఏదిబడితే అది మాట్లాడుతున్నారని, కావాలనే అధికారపార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.