విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పై కాల్పులు మావోయిస్టు అగ్రనేత ఆర్కే.. నేతృత్వంలో జరిగినట్టు తెలుస్తోంది. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ. అరకులో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని వస్తున్న కిడారి, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 50 మంది మావోలు పాల్గొన్నట్టు సమాచారం. వాహనాలలో ఉన్న మిగతా వారిని దించేసి వారిద్దరిని మావోలు హత్య చేశారు. గత రెండు రోజులుగా విశాఖ మన్యంలో మావోల వారోత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే వారంతా నిర్ణయానికి వచ్చి దాడి చేసినట్టు తెలుస్తోంది. బాక్సైట్ అక్రమ తవ్వకాలపై మావోలు పలుమార్లు కిడారిని హెచ్చరించారు. అయినా కూడా కిడారిలో మార్పు రాకపోవడంతో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. రామకృష్ణ నేతృత్వలో దళ కమాండర్ చలపతి దీనిని అమలు చేసినట్టు తెలుస్తోంది.
ఈ కాల్పులు ఆర్కే నేతృత్వంలో జరిగినట్టు తెలుస్తోంది. అసలు ఇంతకీ ఈ ఆర్కే ఎవరంటే.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం తగరకుంట గ్రామానికి చెందిన సాధనాల రామకృష్ణే ఆర్కే. సాధనాల రామకృష్ణ మావోయిస్టు పార్టీలో సీనియర్ సభ్యుడు. 1979లో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. వరంగల్ లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఇసి)లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్‌యులో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.
సాధనాల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర సాంకేతిక కమిటీ చీఫ్‌గా ఉన్నారు. మావోయిస్టులకు చెందిన ఆయుధ కర్మాగారాలన్నీ అతని చేతిలోనే ఉంటాయని తెలుస్తోంది. రాకెట్ లాంచర్ల తయారీలో ఆయనది అందెవేసిన చేయి అని పలువురు చెబుతారు.
ఆయనకు సంతోష్, భాను, వినోద్ అనే మారు పేర్లున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన మల్లోజులు కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీది కూడా కరీంనగర్ జిల్లానే. కిషన్‌జీ స్థానంలో రామకృష్ణ వచ్చారు. చిన్న చిన్నగా ఎదుగుతూ మావోయిస్టు అగ్రనేతగా ఆర్కే ఎదిగారు. పలు ఎన్ కౌంటర్లలో రామకృష్ణ ప్రధాన నాయకత్వం వహించాడు. పలుసార్లు పోలీసుల నుంచి చాకచాక్యంగా తప్పించుకున్నాడు.
2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నక్సలైట్ల చర్చలకు రామకృష్ణ నాయకత్వం వహించారు. ఆర్కే భార్య పద్మ అలియాస్ శిరీష. ఈమె కూడా పార్టీలో పని చేసి ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిశారు. ఆర్కే మాత్రం ఉద్యమంలోనే ఉన్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నట్టు తెలుస్తోంది. జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చినా కూడా ఆర్కే మాత్రం ప్రజలలో కలువలేదు. నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఆర్కే ఎమ్మెల్యే కాల్పుల్లో పాల్గొనడంతో మళ్లీ హాట్ టాపిక్ గా మారాడు.