కడపలో దారుణం చోటు చేసుకుంది. కలకాలం కలిసి జీవించాల్సిన జంట, అనారోగ్యం కారణంగా భర్త చనిపోగా… ఆ విషయం జీర్ణించుకోలేని భార్య గుండెపోటుతో మరణించింది. జీవితంలోనే కాదు మృత్యువులో కూడా ఒకరికి ఒకరు తోడుగా వెళ్ళిపోయారు.
వివరాల్లోకి వెళితే… 58 సంవత్సరాల ప్రభుదానం క్రిస్టోఫర్, 54 సంవత్సరాల స్వర్ణలత దంపతులు కడప లోని విశ్వనాథపురంలో నివాసం ఉంటున్నారు. క్రిస్టోఫర్ కడప కోర్టులో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. స్వర్ణలత కడప పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా పని చేస్తోంది. అయితే క్రిస్టోఫర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో సోమవారం క్రిస్టోఫర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈయన అంతక్రియలు మంగళవారం జరిగాయి. అంత్యక్రియలు అనంతరం తిరిగి ఇంటికి వచ్చిన స్వర్ణలత ఎక్కువ ఒత్తిడికి గురై ఇంటిలోనే గుండెపోటుతో కుప్ప కూలిపోయింది. బంధువులు హుటాహుటిగా ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిందని డాక్టర్లు ద్రువీకరించారు. ఈ పరిణామంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.