ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మత రాజకీయం చేస్తూ అధికార ప్రభుత్వం మీద బురద చల్లటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రతీ అంశాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏపీలో ఇప్పుడు టీడీపీ నేతలు రామతీర్ధం ఘటన తర్వాత చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ కూడా ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు.
మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య హఠాన్మరణంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు… వారి కుటుంబానికి టీడీపీ ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది అన్నారు. పట్నం సుబ్బయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. ఇక ఏపీలో గో పూజ ఘనంగా నిర్వహిస్తున్న నేపధ్యంలో.. గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం జగన్ రెడ్డికి తగదు అని సూచించారు.
దిగజారుడు రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. ఏ మతాన్నీ ప్రశాంతంగా ఉండనిచ్చే వ్యక్తిత్వం జగన్ కు లేదు అని ఆయన ఆరోపించారు. అందుకే క్రిష్టియన్లకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్, హిందువులకు సంక్రాంతి కానుకలు దూరం చేశారు అని విమర్శించారు. ఓ వైపు రథాలు తగలబెట్టి, విగ్రహాలను ధ్వంసం చేయించి మరో వైపు పూజల్లో పాల్గొంటున్నారు అని మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో ఏ మతంపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారో చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు. మతాల మధ్య మంట పెట్టి చలికాచుకునే విధానానికి వైసీపీ స్వస్తి పలకాలని ఆయన ఆరోపించారు. మొదటి ఘటన జరిగినప్పుడే ప్రభుత్వానికి సూచించినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది అని అన్నారు. ఘటనలు జరిగి ఇన్ని రోజులు కావొస్తున్నా నిందితులను పట్టుకోవడం చేతకాని ప్రభుత్వం రాష్ట్రానికి దండగ అని అచ్చెన్నాయుడు విమర్శించారు.