లోకేష్ హామీల వర్షం… సీనియర్లు సీరియస్?

టీడీపీ యువ కిశోరం.. నారా లోకేష్ జ‌న‌వ‌రి 27న ప్రారంభించిన “యువ‌గ‌ళం” పాద‌యాత్ర మూడు తిట్లు – ఆరు హామీలతో సాగిపోతుంది! ఈ యాత్ర ప్రారంభమై ఇంకా నెల రోజులు కూడా పూర్తికా కుండానే.. ఈ యాత్ర ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 20 పెద్ద భారీ హామీల‌నే గుప్పించారు చినబాబు. దీంతో అటు ప్రతిపక్షం నుంచి, ఇటు టీడీపీ నేతల నుంచి కూడా లోకేష్ పై సెటైర్లు పడుతున్నాయి!

అవును… అవగాహనా లోపమో.. అనుభవరాహిత్యమో.. కారణం ఏమైనా కావొచ్చు కానీ… చినబాబు లోకేష్ మాత్రం హామీల వర్షాలు కురిపించేస్తున్నారు! అయన సీఎం అభ్యర్ధి కాకపోయినా.. తన తండ్రి సీఎం అయితే, తానే కదా అన్నీ దగ్గరుండి చూసుకునేది అని ఫీలవుతూ.. వరాలు ఇచ్చేస్తున్నారు! హామీలు ఇవ్వడం.. అనంతరం వాటిని తూచా తప్పకుండా నెరవేర్చడం వంటి విషయాలపై పూర్తిగా అవగాహన లేకో ఎమో కానీ… పాదయాత్ర ప్రారంభించిన దగ్గరనుంచి 20భారీ హామీలను గుప్పించడం అంటే చిన్న విషయం కాదని అంటున్నారు టీడీపీ సీనియర్లు.

హామీల విషయంలో ఆత్రం పనికిరాదని.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇవ్వాలని ఆఫ్ ది రికార్డ్ చెబుతున్న పరిస్థితి! ఇదే క్రమంలో… హామీలనేవి కేవలం ఆకర్షించడం కోసం అనే అజ్ఞానపు పోకడలుపోవాలని.. సాధ్యాసాధ్యాలు పరిగణలోకి తీసుకోకుండా హామీలిస్తే.. గతంలో లాగానే అవి గాల్లో కలిసిపోతాయని చెబుతున్న విశ్లేషకులు… గతంలో బాబు ఇచ్చి, అనంతరం గాలికి వదిలేసిన హామీల్లో ఒకటైన “నిరుద్యోగ భృతి” ని గుర్తుచేస్తున్నారు!

మరి ఇకనుంచైనా హామీలు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు వెనకా ముందూ ఆలోచించుకుని, సాధ్యసాధ్యాలు బేరీజు వేసుకుని ఇస్తారా..? లేక, “అధికారంలోకి వచ్చినప్పుడు కదా.. అప్పుడు చూదాం లే” అని లైట్ తీసుకుంటారా అన్నది వేచి చూడాలి!