మన్సాస్ ట్రస్ట్.. సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త.. పదవుల నుంచి మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కొన్నాళ్ళ క్రితం తొలగింపబడిన విషయం విదితమే. ఆయన స్థానంలో సంచయిత గజపతిరాజు మన్సాస్ ట్రస్టు బాధ్యతల్ని, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త బాధ్యతల్ని అందుకున్నారు.
ఈ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. ఆ జీవోల్ని అశోక్ గజపతిరాజు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా, జగన్ సర్కారు జారీ చేసిన జీవోల్ని కొట్టివేసింది.
దాంతో, అశోక్ గజపతిరాజు.. సంచయిత గజపతిరాజు మీదనే కాకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంపైనా విజయం సాధించినట్లయ్యింది. రాజకీయ కుట్రలకు దేవస్థానాల్నీ, ట్రస్టునీ వాడుకున్నారనే అప్రతిష్ట వైఎస్ జగన్ సర్కారు అప్పట్లో మూటగట్టుకుంది. అది నిజమేనని కోర్టు తీర్పు ద్వారా తేలిందంటోంది తెలుగుదేశం పార్టీ.
ఈ తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు.. అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అశోక్ గజపతిరాజు సీనియర్ పొలిటీషియన్. విజయనగర రాజుల వారసుడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సంచయిత ఎవరో కాదు, సాక్షాత్తూ అశోక్ గజపతిరాజు సోదరుడి కుమార్తు. ఇరువురి మధ్యా ఆధిపత్య పోరు వెనుక కారణమేంటి.? అన్నది వేరే చర్చ.
కానీ, బీజేపీ నేత అయిన సంచయితకు, మన్సాస్ బాధ్యతలు అప్పగించడంలో వైసీపీ చూపిన అత్యుత్సాహం వివాదాలకు తావిచ్చింది. ‘మాకేంటి సంబంధం.?’ అని వైసీపీ ఇప్పుడు అనడానికి వీల్లేని పరిస్థితి. ఏది ఏమైనా, ఈ వ్యవహారంలో సంచయితకి బీజేపీ నుంచే మద్దతు లభించనప్పుడు, వైసీపీ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.