మస్ట్ రీడ్: “బాబు శంకుస్థాపన… జగన్ శంకుస్థాపన” తేడా ఇది!

తాజాగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దీనిపై అర్ధజ్ఞానంతోనూ అజ్ఞానంతోనూ కొంతమంది వాస్తవాలు మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన చోట జగన్ మళ్లీ ఎందుకు శంకుస్థాపన చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయాలపై అశోక్ గజపతిరాజు కూడా అసత్య ప్రకటనలు చేశారు. వాటికి సంబంధించిన వివరణలు ప్రసుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి!

తమ హయాంలోనే జరిగిన భోగాపురం ఎయిర్‌ పోర్టు శంకుస్థాపనకు మళ్ళీ నేడు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయటం ఏమిటని మండిపడుతున్నారు అశోక్ గజపతి రాజు. విజ్ఞత మరిచారో.. లేక, సావాస దోషఫలితంగా పలికారో తెలియదు కానీ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే… చంద్రబాబు శంకుస్థాపన విషయంలో రాజుగారు చెప్పింది కొంతవరకే కరెక్టే కానీ… అసలుదంతా అబద్ధమే. అది రాజుగారికి తెలియంది కాదు! ఎందుకంటే చంద్రబాబునాయుడు నాడు భోగాపురంలో చేసింది కేవలం ఎన్నికల శంకుస్థాపన మాత్రమే.

అవును… ఎన్నికల సమయంలో జనాల కళ్ళకు గంతలుకట్టేందుకు కొన్ని అసమర్థ ప్రభుత్వాలు.. అసత్య శంకుస్థాపనలు చేస్తుంటాయి. అందులో భాగంగానే గతంలో చంద్రబాబు కూడా భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపనలు చేశారు. అది ఎన్నికల శంకుస్థాపన అని అనడానికి అనేక కారణాలున్నాయి. ఈ విషయాలు నాడు విమానయాన శాఖకు మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజుకు తెలియదా? అంటే… ఆయనే సమాధానం చెప్పాలి.

2019, ఫిబ్రవరి 14వ తేదీన అంటే సరిగ్గా ఎన్నికలకు రెండునెలల ముందు చంద్రబాబు భోగాపురం ఎయిర్‌ పోర్టుకు శంకుస్థాపన చేశారు. సరే అప్పటికి వీలై ఉంటుంది అనుకుంటే… పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే… అప్పటికి భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు లేవు. విమానయాన శాఖ “నో అబ్జెక్షన్ సర్టిఫికెట్” (ఎన్.ఓ.సీ) జారీచేయలేదు. ఆఖరికి ప్రాధమికంగా జరగాల్సిన భూసేకరణ కూడా జరగలేదు. పైగా అప్పటికే రైతులు కోర్టులో కేసులు వేసి ఉన్నారు.

ఇన్ని అడ్డంకులున్నా చంద్రబాబు మాత్రం ఎంతో ఆర్భాటంతో శంకుస్థాపన చేసేశారు. అంటే అచ్చంగా ఎన్నికల శంకుస్థాపన అన్నమాట. అక్కడితో ఆగని బాబు… విమానాశ్రయం నిర్మాణాన్ని చూపించి సుమారు రు. 800 కోట్లు అప్పుతీసుకుని దారి మళ్ళించేశారు! ఇవి భోగాపురంలో బాబుగారి శంకుస్థాపన వ్యవహారంలోని వాస్తవాలు!

అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్… అవసరమైన అన్నీ క్లియరెన్సులను తీసుకున్నారు.. రైతులతో మాట్లాడి భూసేకరణ పూర్తిచేశారు.. కోర్టు కేసులను క్లియర్ చేసుకున్నారు.. రైతులకు ప్రత్యామ్నాయంగా ఇతర గ్రామాల్లో కాలనీలు కట్టించి శంకుస్థాపన చేస్తున్నారు. అంటే… చంద్రబాబుది ఎన్నికల శంకుస్థాపన.. అయితే, జగన్ ది నిజమైన శంకుస్థాపన అన్నమాట! ఈ విషయాలు అన్నీ తెలిసి కూడా ఒకవర్గం మీడియా, నాటి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అసత్యాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఫలితంగా మరోసారి ఏపీ ప్రజలను ఏమార్చేపనికి పూనుకుంటున్నారు!