కొడాలి నానీపై అరెస్ట్ వారెంట్.. కేసేటంటే…!

మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ట్రంప్ కార్డ్ అయిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ ఇంకా పెండింగ్ లో ఉండటంప ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో… కొడాలి నాని తీరుపైనా, ఆయన కోర్టుకి రాకపోవడమనే నిర్లక్ష్యంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా స్పందించిన ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం… కొడాలి నానిపై అరెస్టు వారెంట్ ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది! ఇలా.. కొడాలి నానిపై అరెస్టు వారెంట్ ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం… గవర్నర్ పేట సీఐ కి ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు.

ఇంతకూ కేసేటంటే… తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా అంశంపై 2016 మే 10వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి అనుమతి లేకున్నా వన్ వే లో ర్యాలీ నిర్వహించారు కొడాలి నాని. దీంతో… ర్యాలీకి అనుమతి లేకున్నా.. పోలీసుల ఉత్తర్వులను ఉల్లంఘించి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారనే ఆరోపణలతో కొడాలి నాని పై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.

అయితే… ఈ కేసు విచారణకు కొడాలి నాని హాజరు కావడం లేదు. దీంతో సీరియస్ అయిన న్యాయస్థానం… నానీపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2023 జనవరి 5వ తేదీ నుంచి ఈ కేసు పెండింగ్ లో ఉంది!