మంగళగిరిలో 360 ఈవిఎంలు పనిచేయటం లేదా ?

రాష్ట్రమంతా ఎదురు చూస్తున్న మంగళగిరి నియోజకవర్గం పోలింగ్ విషయంలో కూడా ఉత్కంఠ రేపుతోంది. వైసిపి సిట్టింగ్ ఎంఎల్ఏకు పోటీగా టిడిపి నుండి నారా లోకేష్ ఎప్పుడైతే రంగంలోకి దిగారో అప్పటి నుండే అందరి దృష్టి మంగళగిరి మీద పడింది. ప్రచారం దగ్గర నుండి ప్రలోభాల వరకూ మిగిలిన అన్నీ నియోజకవర్గాలకన్నా ఇక్కడే అందరి దృష్టి కేంద్రీకృమైంది.

చివరకు పోలింగ్ రోజు కూడా అందరి దృష్టి ఇక్కడే ఉందంటే కారణం  మొరాయిస్తున్న ఈవిఎంలే. నియోజకవర్గంలోని మొత్తం ఈవిఎంలలో 360 పనిచేయటం లేదట. ఉదయం పోలింగ్ మొదలుకాగానే చాలా చోట్ల ఓటింగ్ మెషీన్లు మొరాయించాయి. ఉదయాన్నే ఓట్లు వేసి వెళ్ళిపోదామని కేంద్రాల దగ్గరకు చేరుకున్న ఓటర్లకు చాలా చోట్ల తీవ్ర నిరాసే ఎదురైంది.

ఓటర్లు ఉదయం నుండే బారులుతీరినా ఈవిఎంలు పనిచేయకపోవటంతో  చాలామందికి విసుగేసింది. దాదాపు మూడుగంటల పాటు వెయిట్ చేసిన తర్వాత కూడా ఈవిఎంలు పనిచేయకపోవటంతో వెనక్కు వెళ్ళిపోయారట. ఒకవిధంగా చూస్తే అధికార టిడిపికి కావాల్సింది కూడా అదేనేమో ? ఓటర్లలో వెల్లువెత్తుతున్న ఉత్సాహం వల్ల అధికార పార్టీకి ఎక్కువ నష్టం. అందుకనే ఈవిఎంలు చాలాచోట్ల పనిచేయకున్నా టిడిపి నేతలు ఆ విషయంలో పెద్దగా స్పందించటం లేదు. చంద్రబాబు మాత్రం ఇదే విషయమై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు.

నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 360 ఈవిఎంలు పనిచేయకపోవటంపై వైసిపి అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రం ముందు ధర్నా చేశారు. ఓటర్లతో కలిసి ఆళ్ళ ధర్నాకు దిగటంతో పోలింగ్ అధికారులు చివరకు స్పందిచక తప్పలేదు. స్టాండ్ బై ఈవిఎంలను ఏర్పాటు చేస్తున్నామని, రిపేరైన వాటిని వెంటన సరిచేస్తున్నామనే మొక్కుబడి ప్రకటన చేసి తప్పుకున్నారు. మరి ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.