మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ జనసేన పార్టీ అమరావతి రైతులకు మొదట్లో మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మిత్రపక్షం బీజేపీ ఇన్వాల్వ్ మెంట్ తో జనసేన పార్టీ అమరావతి దూకుడిని ఒక్కసారిగా తగ్గించింది. బీజేపీ తానా అంటే..జనసేన తందానా అంది. చివరికి పవన్ కళ్యాణ్ అమరావతి రైతులకు న్యాయం జరిగితే చాలు..అది ఎలాగైనా పర్వాలేదని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ ఎలాగూ వైసీపీకి వెనుకనుండి మద్దతిస్తుంది. దీంతో జనసేన మింగిల్ కాక తప్పలేదన్నది అంతర్గత సంగతి. మూడు రాజధానులకు సంబంధించి రాజముద్ర తర్వాత విశాఖ పరిపాలనా రాజధానిగా అవతరించింది.
హైకోర్టులో స్టేటస్ కోతో తాత్కాలికంగా తరలింపుకు- జగన్ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. అదెంతో కాలం కాదన్నది తెలిసిందే. మరోవైపు విశాఖకు తరలింపు పనులు కూడా యంత్రాంగం ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. స్టేటస్ కో తో సంబంధం లేకుండా జగన్ న్యాయపరంగా అడ్డంకులు లేని అంశాలకు సంబంధించి చర్యలు తీసుకుంటూ మూవ్ చేస్తున్నారన్నది అనధికారిక సమాచారం. సీఎం క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఇప్పటికే స్థలం కేటాయించపడింది. దాదాపు 30 ఎకరాల్లో విశాఖ సాగరతీరం నడిబొడ్డున అందమైన ప్రదేశంలో గెస్ట్ హౌస్ లతో పాటు, క్యాంపు కార్యాలయం కూడా ఏర్పాటు కాబోతుంది.
అయితే అధికారిక వైసీపీ కంటే ముందే జనసేన-బీజేపీ పార్టీలు విశాఖకు తమ శాశ్వత పార్టీ కార్యాలయాల్ని తరలించాలని ఆలోచన చేస్తున్నారుట. వీలైనంత త్వరగా సాగార తీరాన పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసి రాజకీయాలన్నీ అక్కడ నుంచి నడపించాలని భావిస్తున్నారుట. మరి అధికారిక పార్టీ తరలకుండానే ముందే ఈ రెండు పార్టీలు విశాఖలో జెండా పాతడం వెనుక కారణం ఏంటి? అంటే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ టార్గెట్ గా జనాల్లో వ్యతిరేకత తీసుకురావడం కోసం తరలింపు అని వినిపిస్తోంది. రెండు పార్టీలు ఉమ్మడి కార్యక్రమాలతో ముందుకెళ్లాలని దానికి సంబంధించి ప్రత్యేకమైన ప్రణాళిక ఒకటి సిద్దం చేసి పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా జనసేన-బీజేపీ ఆధ్వర్యంలో విశాఖలో భారీ మహా సభ ఒకటి ఏర్పాటు చేయాలన్నది ప్లాన్ అట. మూడు రాజధానుల నిర్ణయంతో వైసీపీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆ పార్టీ మరింత బలం పుంజుకుంది. ఇప్పుడా బలాన్ని బలహీన పరచడం కోసమే బీజేపీ-జనసేన కొత్త ఎత్తుగడతో ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది.