అప్పులు మాత్రమేనా.? యెల్లో మీడియాకి ఇంకేమీ కనిపించడంలేదా.?

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అవి వైసీపీ అనుకూల మీడియాకి మాత్రమే కనిపిస్తాయి. టీడీపీ అనుకూల మీడియాకి అస్సలు కనిపించవు. గతంలోనూ అంతే, అప్పట్లో సమస్యలన్నీ వైసీపీ అనుకూల మీడియాకే కనిపించేవి, టీడీపీ అనుకూల మీడియాకి కనిపించేవి కావు. కానీ, అసలు విషయమేంటో ప్రజలు పసిగట్టారు, చెప్పాల్సిన బుద్ధి చెప్పారు ఎన్నికల్లో.

2024 ఎన్నికల్లో ఏం జరుగుతుంది.? అది వేరే చర్చ. రాష్ట్రంలో అప్పులు తప్ప, టీడీపీ అనుకూల మీడియాకి ఇంకేమీ కనిపించడంలేదు. వైసీపీ అనుకూల మీడియా అయితే, అధికార పార్టీ భజనలోనే మునిగి తేలుతుందనుకోండి.. అది వేరే సంగతి. వైసీపీకి సొంత మీడియా వుంది. టీడీపీకి సొంత మీడియా లేదు.. కానీ, టీడీపీ కోసం పనిచేసే మీడియా సంస్థలున్నాయి.

అనునిత్యం రాష్ట్రానికి సంబంధించిన అప్పుల గురించే టీడీపీ అనుకూల మీడియా తెగ బాధపడిపోతుంటుంది. అధికారంలో వున్నవారిని ఎద్దేవా చేసేందుకో, ర్యాగింగ్ చేసేందుకో.. ఈ అప్పుల కథనాల్ని నిత్యం వండి వడ్డిస్తుంటాయి. తెలంగాణలోనూ అప్పులున్నాయ్.. దేశానికీ అప్పులున్నాయి. వై ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అప్పుల చర్చ.?

రాష్ట్రం ప్రత్యేక పరిస్థితుల్లో వేరుపడింది.. పాత పేరు, కొత్త రాష్ట్రం.. అది కూడా రాజధాని లేని రాష్ట్రం. అప్పులు తప్పువు.. ఎందుకంటే కేంద్రం ఆదుకోవడంలేదు గనుక. మరి, ఈ మీడియాలో కనిపిస్తున్న అప్పుల గోలని జనం ఎలా అర్థం చేసుకుంటున్నారు.? సంక్షేమమైతే వారికి జరుగుతోంది.. ఈ అప్పుల గోల జనానికెందుకు.?