ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్‌ను భారీ దొంగతనం గడగడలాడిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉన్న ఈ కంపెనీలో ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం కావడం సంచలనంగా మారింది. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ విషయంపై కంపెనీ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. తమిళనాడు నుంచి కియా ఫ్యాక్టరీకి ఇంజిన్లు తరలిస్తారు. అయితే ఇటీవల వచ్చిన లోడ్‌లో చాలా ఇంజిన్లు కనిపించకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి.
అయితే రవాణా సమయంలోనే చోరీ జరిగిందా? లేక ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాతే ఏదైనా మాయమైందా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. గత నెల 19న కంపెనీ అధికార ప్రతినిధులు ముందుగా నోటి ఫిర్యాదు చేశారు. అయితే, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించడంతో, తక్కువ సమయంలోనే పూర్తి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం కేసుపై పని చేస్తోంది. ఇది రాష్ట్రంలోనే తాజా సంచలనంగా మారింది.
పోలీసులు ఇప్పటికే లారీలు, డ్రైవర్లు, గోదాములు, లోడ్ ట్రాకింగ్ లాగ్స్ వంటి అనేక అంశాలను విచారిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీలోని సీసీ కెమెరాల ఫుటేజ్, లాజిస్టిక్స్ డేటా ఆధారంగా దర్యాప్తు మరింత ముమ్మరమవుతోంది. సంస్థలో పనిచేసే కొందరిపై లోపలి కుట్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కియా యాజమాన్యం కూడా తమ అంతర్గత ఆడిట్ ప్రారంభించినట్లు సమాచారం.
ఈ దొంగతనం ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు త్వరలో మీడియా ముందుకు రానున్నారు. కియా సంస్థ వంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలో ఇలాంటి ఘటన జరగడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. చివరికి ఈ మిస్టరీ దొంగతనం వెనక అసలైన కథ ఏమిటో త్వరలోనే తేలనుంది.


