ఆంధ్ర జాక్ పాట్ కొట్టేసింది…

అంతర్జాతీయ అర్థిక వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పెద్దగా విదేశీ పెట్టుడులురాక అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ జాక్ పాట్ కొట్టేసింది. తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా అన్నివైపుల నుంచి దాడి ఎదుర్కొంటూ తడబడుతూ 2019 ఎన్నికలవైపు వెళుతున్నపుడు రు 24,500 కోట్ల ఎఫ్ డిఐ  జాక్ పాట్ చేతికందింది. ఇది నిజంగా ముందుకు సాగి, కార్యరూపం దాల్చి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తే మాత్రం విదేశీ పెట్టుబడులలో ఒక రికార్డు అవుతుంది.

ఇండోనేషియాకు చెందిన ఏషియా పల్ప్ అండ్ పేపర్ (ఎపిపి) రాష్ట్రంలో 3.5 బిలియన్ అమెరికన్ డాలర్ల (రు.24,500 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. విదేశీ పెట్టుబడులు రావడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంత వకు ఏ రాష్ట్రానికి ఇంత పెద్ద పెట్టుబడి ఒకే కంపెనీ నుంచి రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇది ఇండియాకు వచ్చిన బిగ్గెస్ట్ సింగిల్ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ అని ఇంగ్లీష్ మీడియా రాస్తున్నది. ఏపిపి హెడ్ క్వార్టర్స్ రాజధాని జకార్తాలో ఉంది. ఎపిపి ఇండోనేషియాకు చెందిన ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ ‘ఇండోనేషియన్ సినార్ మాస్ గ్రూప్’ నకు చెందింది. ఎపిపి ప్రకాశం జిల్లాలో అయిదు మిలియన్ టన్నుల కెపాసిటితో కొత్త పల్ప్ అండ్ పేపర్ మిల్లు ఏర్పాటుచేస్తుంది.

పరిశ్రమ 2741 ఎకరాలో ఏర్పాటవుతుంది. రు. 24,500 కోట్లతో ఇతర రాష్ట్రాలు అసూయపడేంత పెద్ద పెట్టుబడి ఇది. ఈ ప్రాజక్టును రెండుదశల్లో పూర్తి చేస్తారు. ఈ ఫ్యాక్టరీ వల్ల 4 వేల మంది నేరుగా, 12 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. దీనికి సంబంధించి రాష్ట్రఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవెలప్ మెంట్ బోర్డుకు ఒక అవగాహన కుదిరింది. పేపర్ మిల్లుకు రామాయపట్నం దగ్గిర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు శంకుస్థాపన చేశారు.

పేపర్‌ మిల్స్‌కు సంబంధించిన ఒప్పంద పత్రాల మీద ఏపీపీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సురేశ్‌ కిలాం, ఈడీబీ సీఈవో జే కృష్ణకిషోర్‌ లు సంతకాలు చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ ప్రారంభ దశలోనే ఒక పెద్ద పరిశ్రమ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం ఓ చరిత్ర అని ముఖ్యమంత్రి అన్నారు.

కీలకమయిన 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి  చంద్రబాబుకు ఇంది కొండంత వూరట నిస్తుంది. ఇది రాష్ట్రానికి వచ్చిన రెండో పెద్ద విదేశీ పెట్టుబడి. మొదటిది కియా మోటార్స్ నుంచి వచ్చింది. ఇతర కంపెనీలు ఆంధ్ర రావడానికి ఇది ఎంతో దోహదపడుతుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇన్వెస్టమెంట్లు రాత్రికి రాత్రి రావు. ఒకచోట తమఇన్వెస్ట్ మెంట్ కు భరోసా ఉందని నమ్మకం కుదరినపుడే విదేశీయులొస్తారు. ఈ విషయంలో ఎపిపి ని ఒప్పించి రప్పించడంలో ఆంధ్ర ప్రదేశ్ విజయవంతమయింది. దీని వెనక పని చేసిన ప్రతిఒక్కరిని ఇక్కడ అభినందించాలి.

అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఏర్పాటైన కియ కార్ల పరిశ్రమ ఉత్పత్తి మొదలుపెట్టింది. తొలికారు జనవరి 29వతేదీ మార్కెట్‌లో విడుదలవుతున్నది.

కియా లాగానే పేపర్‌ పరిశ్రమ తొలిదశను 20 నెలలోపు పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులముఖ్యమంత్రి సూచించారు.

అయితే, ఇక్కడొక వార్నింగ్. పేపర్ పరిశ్రమ వల్ల కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అడవులు అంతరించిపోతాయి. అడవులు నరికేస్తున్న డేటాను పరిశ్రమలు దాచిపెడతాయి. ఎపిపి మీద ఇలాంటి ఆరోపణలున్నాయి. పర్యావరణ పరంగా అంతర్జాతీయంగా బాగా చెడ్డపేరున్న కంపెనీలలో ఎపిపి ఒకటి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమయిన పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవాలి. ఎపిపి మీద నిఘా పెంచాలి.