ఆంధ్రప్రదేశ్‌లో బెస్ట్ పొలిటికల్ ప్యాకేజీ ఏది.?

ప్యాకేజీ.. అనే మాట రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నది జనసేన పార్టీ చుట్టూనే. ఓ వైపు వైసీపీ, ఇంకో వైపు టీడీపీ.. వీటికి అనుబంధంగా ఆయా రాజకీయ పార్టీల అనుకూల మీడియా సంస్థలు.. జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ‘ప్యాకేజీ’ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు పవన్ కళ్యాణ్‌కి రాజకీయాల్లో ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరమేంటి.? నిజానికైతే లేదు. కానీ, జనసేన పార్టీని స్థాపించింది మొదలు, జనసేన అధినేత వ్యూహాత్మక రాజకీయ తప్పిదాలకు పాల్పడుతుండడంతోనే ఆయన మీద ప్యాకేజీ ముద్ర పడింది.

పైగా, ప్రజారాజ్యం పార్టీని అప్పట్లో చిరంజీవి, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి.. కేంద్ర మంత్రి పదవి తీసేసుకోవడంతో, ‘పార్టీని అమ్మేశారు, ప్యాకేజీ తీసుకున్నారు..’ అనే విమర్శలొచ్చాయి. ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ యూత్ వింగ్ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీ మకిలిని పవన్ కళ్యాణ్ వదిలించుకోవడం అంత తేలిక కాదు. చంద్రబాబు వందల కోట్ల ప్యాకేజీని పవన్ కళ్యాణ్‌కి ఇచ్చారనీ, ఇస్తున్నారనీ వైసీపీ ఆరోపిస్తోంది. కాదు కాదు, భారత్ రాష్ట్ర సమితి నేరుగా పవన్ కళ్యాణ్‌కి వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేసిందని టీడీపీ అనుకూల మీడియా అంటోంది.

ఇవేవీ కాదు, వైసీపీనే జనసేన పార్టీకి ప్యాకేజీ ఆఫర్ చేసిందనీ, ఈ ప్యాకేజీ కింద 20 ఎమ్మెల్యే సీట్లను గెలిపించి ఇవ్వబోతున్నారని టీడీపీ అనుకూల మీడియా కొత్త పల్లవి అందుకుంది. ఏది నిజం.? అన్నది పక్కన పెడితే, 20 సీట్ల ప్యాకేజీ డీల్ అన్నది చాలా చాలా ప్రత్యేకం.! బెస్ట్ ప్యాకేజీ కూడా ఇదే అవ్వొచ్చు.