గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు అవమానం జరిగింది. దెందులూరు నుంచి అమరావతికి కారులో వెళ్తున్న చింతమనేనిని కాజా టోల్ గేట్ దగ్గరకు రాగానే సిబ్బంది ఆయన కారును ఆపారు. టోల్ ఫీజు చెల్లించాలని అన్నారు. తాను ఎమ్మెల్యేనని చింతమనేని చెప్పినా సిబ్బంది వినలేదు.
సిబ్బంది తీరు పట్ల చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేనని చెప్పినా వినకపోవడం ఏంటి తానెవరో తెలియదా అని వారిని నిలదీశారు. సిబ్బంది తీరుకు నిరసనగా కారును అక్కడే వదిలి పెట్టి గుంటూరు బస్సు ఎక్కి ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లి పోయారు.
ఎమ్మెల్యే కు జరిగిన అవమానం తెలుసుకున్న టిడిపి నేతలు అక్కడకు చేరుకొని సిబ్బందిని ప్రశ్నించారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఇంతలో అక్కడకు పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సిబ్బంది చేత ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పిస్తామని టోల్ గేట్ అధికారులు తెలపడంతో అంతా శాంతించారు. ఎమ్మెల్యే కారును టోల్ గేట్ పార్కింగ్ స్థలంలో ఉంచారు. టోల్ సిబ్బంది అతిగా ప్రవర్తించడంతో ఈ ఘటన జరిగిందని టిడిపి నాయకులు విమర్శించారు.