రూ.371 కోట్లు… ఎవరి “స్కిల్” ఫలితమిది?

ఏపీ స్కిల్ డెవలప్‌ మెంట్ కార్పోరేషన్ స్కాం కేసులో సీఐడీ అధికారులు భాస్కర్‌ ను అరెస్టు చేశారు. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ ను సీఐడి అదుపులోకి తీసుకుంది. నోయిడాలో అతడ్ని అరెస్టు చేసిన సీబీఐ.. ట్రాన్సిట్‌ వారంట్‌ పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది. సిమెన్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో భాస్కర్ కీలక పాత్ర పోషించాడనేది ఆయనపై ఉన్న అభియోగం! ఆ ప్రోగ్రాం అసలు ధర రూ.58కోట్లుగా ఉంటే.. దానిని రూ.3,300 కోట్లుగా ప్రభుత్వానికి చూపెట్టాడని, ఫలితంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్దల సహాయంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్‌ ప్రాజెక్టులో మోసాలకు పాల్పడ్డాడని సీఐడీ ఆరోపిస్తుంది!

చంద్రబాబు హయాంలో యువతలో నైపుణ్యాలు పెంచేందుకనే కార్యక్రమంలో భాగంగా… జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసమని ప్రత్యేకంగా “ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌”ను ఏర్పాటు చేసింది. దీనికోసం సీఈవో, డిప్యూటీ సీఈవో, ఎండీ, డైరెక్టర్, మేనేజర్స్, రీజనల్ మేనేజర్స్ అంటూ ఇలా చాలామందిని అపాయింట్ చేసింది. అయితె… వీరంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులని అప్పట్లో కథనాలొచ్చాయి. ఆ సంగతులు అలా ఉంతే… కారణాలేవైనా కానీ, జగన్ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ పేరు చెప్పి రూ. 3300 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు బయటపడ్డాయి.

ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవాలంటే… ప్రభుత్వానికి, సీమెన్స్ తో ఒప్పందం ప్రకారం ప్రభుత్వం 10 శాతం షేర్ రూ. 371 కోట్లు పెడితే, సీమెన్స్ మిగిలిన మొత్తం వ్యయం చేయాలి. కానీ సీమెన్స్ కంపెనీ రూపాయి విడుదల చేయకుండానే.. నాటి చంద్రబాబు ప్రభుత్వం రూ. 371 కోట్లు విడుదల చేసేసింది. దీనిపై అప్పటి ఆర్థిక‌శాఖ కార్యదర్శి వద్దని చెప్పినా కూడా వినకుండా చంద్రబాబు ఆదేశాల ప్రకారమే నిధులు విడుదలైపోయాయి!

దీంతో… నాడు విడుదలైన నిధులు ఏమయ్యాయ్ అని అడిగితే.. సమాహానం లేదు! దాంతో విషయాన్ని సీఐడీ, ఈడీ సీరియస్‌ గా తీసుకున్నాయి. ఫలితంగా షెల్ కంపెనీల ద్వారా వందల కోట్ల రూపాయల తరలింపుపై దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, డైరెక్టరుగా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ లాంటి కొందరు అరెస్టయిన సంగతి తెలిసిందే!